ఆ పచ్చబొట్టు ప్రచారం కోసం కాదు..

నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. దర్శకుడు రమణ తేజ తెరకెక్కించారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పరిశ్రమలోకి కొత్తగా వస్తున్న దర్శకులు ఎంత కొత్తదనం నిండిన కథలతో వస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కూడా ఆ తరహా ప్రయత్నమేనని అర్థమవుతోంది. నా దృష్టిలో ఇదొక చక్కటి వాణిజ్య విలువలున్న కుటుంబ కథా చిత్రం. ఇందులో యాక్షన్‌ చూపించారు. రొమాన్స్‌ చేశారు. భావోద్వేగాలు పండించారు. ఇలా అన్నింటి మేళవింపుతో ప్రేక్షకుడ్ని అష్టదిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు. హీరోనే కథ అందించాడు కాబట్టి ఈ చిత్రానికి కథే హీరో. నాగøౌర్య గడ్డం లేకుంటే లవర్‌ బాయ్‌లా, ఉంటే యాక్షన్‌ హీరోలా, కిరీటం పెడితే కృష్ణుడిలా ఇలా ఏ తరహా పాత్రకైనా సరిపోయేట్లు ఉంటాడు’’ అన్నారు. ‘‘రాఘవేంద్రరావు చెయ్యి మంచిదని చిత్రసీమలో మంచి పేరుంది. మా చిత్ర ప్రారంభం ఆయన చేతుల మీదుగా జరగడం సంతోషకరం. ఇన్ని రోజులు మా చిత్రం గురించి నేను మాట్లాడా. రేపటి నుంచి సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడే మాటలు వినడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా గుండెలపై ఈ చిత్ర పేరు పచ్చ పొడిపించుకున్నా. ప్రచారం కోసం నేనిలా చెయ్యలేదు. నిజానికి నాకీ చిత్రంతో ఓ భావోద్వేగభరిత సంబంధం ఉంది. మనోజ్‌ తన కెమెరాతో చిత్రాన్ని ఎంతో బాగా చూపించారు. శ్రీచరణ్‌ పాటలు ఆకట్టుకుంటాయి. పరశురాం మాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక జిబ్రాన్‌ నేపథ్య సంగీతం సినిమాను మరో ఎత్తుకు చేర్చింది. నా ఏడాదిన్నర కలలను చిత్ర బృందంలోని ప్రతిఒక్కరూ తమ కలలా కన్నారు. నా నటన, మెహరీన్‌ అభినయం చాలా కొత్తగా ఉంటాయ’’న్నారు నాగశౌర్య. ‘‘నేనీ రోజు ఇక్కడ ఉన్నానంటే అదంతా øౌర్య నాకిచ్చిన పోత్సాహం, నాపై ఉంచిన నమ్మకం వల్లే. ఓ మంచి పని కోసం మా చిత్ర బృందమంతా ఎంతో కష్టపడ్డామ’’న్నారు దర్శకుడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.