స్ఫూర్తిని రేకెత్తించే కథ.. ‘జెర్సీ’

‘తొలి చిత్రం ‘అష్టాచమ్మా’ నుంచి నానిని గమనిస్తున్నా. ఒక అద్భుతమైన... సహజమైన నటుడిగా తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా ఎదిగాడు’’అన్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌. ఆయన సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘జెర్సీ’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అనిరుధ్‌ స్వరకర్త. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పకులు. ట్రైలర్‌ని ఆవిష్కరించిన అనంతరం వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘నాకు క్రికెట్‌ ఇష్టం కాబట్టే ఇక్కడికి రాలేదు. సినిమాపై ఉన్న అనుబంధంతోనే వచ్చా. ‘జెర్సీ’ లుక్‌ చూసినప్పట్నుంచే ఆసక్తిని రేకెత్తించింది. ప్రచార చిత్రాలు చూస్తున్నప్పుడంతా వాస్తవికత కనిపించింది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాల్లోని పాత్రల్లోనే నటులు మరింతగా ఒదిగిపోతారు. సినిమా పూర్తయ్యాక ఎంతో భావోద్వేగానికి గురవుతాం. స్ఫూర్తిని రేకెత్తించే ఒక మంచి కథ ఇది. ప్రతి ఒక్కరూ జీవితంలో సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ ఓటమికి కుంగిపోకుండా అనుకొన్నది సాధించాలనే తపనని రేకెత్తించే చిత్రమిది. ఈ సినిమా మనందరికీ జీవిత పాఠం నేర్పిస్తుంది. నీ కలల్ని సాధించేవరకు విశ్రమించకు అని చెబుతుంది’’ అన్నారు. నాని మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌గారు ఆవకాయలాంటివారు. ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. పెద్ద తెర మీద చూసిన తర్వాతే కాకుండా... వ్యక్తిగతంగా కలిసిన తర్వాత కూడా ఇంకా బాగా నచ్చిన ఒకే ఒక్క నటుడు వెంకటేష్‌. ఎప్పుడో ఒకసారి ఇద్దరం కలిసి సినిమా చేసి, ఒకే వేదికని పంచుకోవాలనే కోరిక బలంగా ఉంది. నువ్వు, వెంకటేష్‌ కలిసి చేస్తే చాలా బాగుంటుందని ఎంతోమంది చెప్పారు. ‘జెర్సీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఆయన రాకతో ఇంకా ప్రత్యేకమైంది. జెర్సీ విషయానికొస్తే... ఏప్రిల్‌ 19న ఈ సినిమా చూసి ప్రేక్షకులంతా గర్వపడతారు. అందరూ గర్వించే సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. ‘జెర్సీ’ స్టైల్‌లోనే చెప్పాలంటే... ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్‌ చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. వాళ్ల దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేన’’న్నారు. ఛాయాగ్రాహకుడు సాను వర్గీస్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. సున్నితమైన, గాఢమైన భావోద్వేగాలు ఇందులో ఉంటాయి’’ అన్నారు. కార్యక్రమంలో మారుతి, సత్యరాజ్‌, సుధీర్‌వర్మ, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, విక్రమ్‌ కె.కుమార్‌, మోహన్‌ చెరుకూరి, రామ్‌ ఆచంట, ప్రవీణ్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.