మాది నవ్వించే ‘గ్యాంగ్‌ లీడర్‌’

‘‘నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఏమాత్రం కష్టపడకుండా చేసిన చిత్రమిదే’’ అన్నారు నాని. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌ కథానాయిక. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 28న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. నాని మాట్లాడుతూ ‘‘చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్‌’ ఈ సినిమాకీ సంబంధం లేదు. మాది నవ్విస్తూ ఆహ్లాదంగా సాగే సినిమా. ‘గ్యాంగ్‌లీడర్‌’లోని ఒక షాట్‌ని మాత్రం ఈ సినిమాలో నేను చేశా. అది చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్‌’ అభిమానులందరికీ నచ్చుతుంది. సెప్టెంబరు తొలి వారంలో ప్రమోషనల్‌ గీతాన్ని విడుదల చేస్తున్నాం. నేను, అనిరుధ్‌ కలిసి ఆ గీతం చేశాం. ఈ రోజే చిత్రీకరణ పూర్తయింది. నాకు ఈ సినిమా ప్రయాణం ఒక పెయిడ్‌ హాలిడేలాగా అనిపించింది. నేను, దర్శకుడు విక్రమ్‌ ఇందులో ప్రతినాయకుడి గురించి మాట్లాడుకొన్నప్పుడు ముగ్గురి పేర్లు తెరపైకొచ్చాయి. అందులో మా ఇద్దరి ఎంపిక కార్తికేయనే. తను ఆ పాత్రని చాలా బాగా చేశాడు. విక్రమ్‌ కె.కుమార్‌ చాలా వేగంగా చేసిన సినిమా ఇది. లక్ష్మి, శరణ్యగారంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అనుభవజ్ఞులైన నటీనటులతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది’’ అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ ‘‘చాలా తక్కువ సినిమాలు చేశాను. ఇంత త్వరగా ఇంత మంచి అవకాశం వస్తుందనుకోలేదు. ‘గుణ 369’ చేస్తున్న సమయంలో ఈ కథ విన్నా. రెండు నిమిషాల్లోనే ఈ సినిమా చేస్తానని ఒప్పుకొన్నా. ఈ సినిమా ఒప్పుకోకపోతే నేనొక మూర్ఖుడికింద లెక్క. నాని మాలాంటి కథానాయకులకి స్ఫూర్తి. నాని, విక్రమ్‌కె.కుమార్‌ సినిమా మొదలవుతుందనగానే ఎగ్జైట్‌ అయ్యా. అలాంటి సినిమాలో నాకు అవకాశం రావడం ఆశ్చర్యం కలిగించింది. హీరోగా చేస్తూ, విలన్‌గా చేయడం రిస్క్‌ అనిపించలేదు. నాని లాంటి కథానాయకుడే విలన్‌గా చేస్తున్నార’’న్నారు. ప్రియాంక మోహన్‌ మాట్లాడుతూ ‘‘నాకు తొలి తెలుగు సినిమా. విక్రమ్‌, నానితో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.