భావోద్వేగంగా ఉంది.. ఏడిస్తే బాగోదని చూస్తున్నా

‘‘నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విజయాన్ని ‘భీష్మ’ రూపంలో నాకందించాడు వెంకీ కుడుముల. ఈ విజయంతో తనెంతో మందికి జవాబు చెప్పాడ’’న్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. రష్మిక కథానాయికగా నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ వేడుక నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు నాలుగేళ్ల తర్వాత వచ్చిన హిట్‌ ఇది. అందుకే భావోద్వేగానికి గురవుతున్నా. ఏడిస్తే చూడటానికి బాగోదని కళ్లజోడు పెట్టుకోని కవర్‌ చేశా. సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా చూసి నితిన్‌ బాగా నవ్వించాడు, బాగా చేశాడు అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. నిజానికి నేను చేసింది వెంకీని కాపీ కొట్టడమే. తను ఈ చిత్రం కోసం బాగా కష్టపడ్డాడు. ‘ఛలో’తో వెంకీకి బ్రేక్‌ ఇచ్చిన రష్మిక.. ఇప్పుడీ చిత్రంతో నాకు బ్రేక్‌ ఇచ్చింది. రష్మికతో కంటే సంపత్‌తో నా వాట్సప్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుటైంది. మహతి సాగర్‌ స్వరాలు.. కాసర్ల, శ్రీమణి పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘అఆ’తో నా కెరీర్‌ భారీ విజయాన్ని అందించిన బ్యానర్‌లోనే మళ్లీ హిట్‌ వచ్చింది. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఛలో’తో తొలి హిట్‌ కొట్టిన వెంకీ.. ఇప్పుడు ‘భీష్మ’తో మరో హిట్‌ కొట్టాడు. తను హ్యాట్రిక్‌ కొట్టాలని కోరుకుంటున్నా. నితిన్‌ నేను ‘శ్రీనివాస కల్యాణంతో’ హిట్‌ కొట్టాలనుకున్నాం కుదర్లేదు. సినిమాలో కథాబలం, వినోదం బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్‌ చేస్తారనడానికి ఈ చిత్రం ఓ ఉదాహరణ’’ అన్నారు దిల్‌రాజు.


దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. ‘‘నా స్క్రిప్ట్‌ను నమ్మి ‘భీష్మ’ చేసే అవకాశమిచ్చిన నితిన్‌కు, నిర్మాతలు చినబాబు, వంశీలకు కృతజ్ఞతలు. అందరి ప్రోత్సాహంలో సినిమాను అనుకున్న విధంగా తియ్యగలిగా. ‘దిల్‌’ నుంచి నితిన్‌ను అభిమానిస్తున్నా. ఈ సినిమాతో కలిసి పనిచేసేటప్పుడు ఆయన ప్రవర్తనకు నేను అభిమానినైపోయా. ఈ సినిమా చేసి రష్మిక తన స్నేహానికి విలువిచ్చింద’’న్నారు. ‘‘ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు వెంకీకి ఎంతో రుణపడి ఉంటాను. ‘భీష్మ’ పాత్రలో నితిన్‌ను చూసి ఆయనకు అభిమానినైపోయా. తన నటనకు, కనిపించిన విధానాన్ని ఎంతో ఇష్టపడ్డా. మ్యూజిక్, ఛాయాగ్రహణం అన్నీ చక్కగా కుదిరిన చిత్రమిది’’ అంది రష్మిక. ఈ కార్యక్రమంలో మహితి స్వరసాగర్, చినబాబు, వంశీ, కాసర్లశ్యామ్, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.