‘ఓ బేబీ’.. మానవ జీవితాల్ని స్పృశించే కథ

‘మంచి సినిమాలు చేసినా, నటిగా రిటైరయ్యేలోగా పరిపూర్ణమైన హాస్య భరిత చిత్రం చేయగలనా అనే సందేహం వెంటాడేది. ‘ఓ బేబి’ సినిమాతో ఆ కోరిక నెరవేరింది’’ అన్నారు సమంత అక్కినేని. ఆమె ప్రధాన పాత్రధారిగా, బి.వి.నందినిరెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌,రావు రమేష్‌, నాగశౌర్య, తేజ కీలక పాత్రధారులు. డి.సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్‌, హ్యున్‌వూ థామస్‌ కిమ్‌ నిర్మాతలు. జులై 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్రబృందం మాట్లాడింది. ‘‘కామెడీని పండించడంలో రాజేంద్రప్రసాద్‌గారి నుంచి నేర్చుకొన్న మెలకువలు నాకు బాగా తోడ్పడ్డాయి.అనుభవజ్ఞురాలైన నటి లక్ష్మితో కలిసి తెరను పంచుకోవడం మంచి అనుభూతినిచ్చింది. చేస్తే మంచి సినిమాలు చేయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలని నిర్ణయించుకొన్న దశలో... ‘మహానటి’, ‘రంగస్థలం’ లాంటి చిత్రాల్లో అవకాశం లభించింది. ఈ ఏడాది తమిళంలో ‘సూపర్‌ డీలక్స్‌’, తెలుగులో ‘మజిలి’ చేశా. ఈ వరసలో నేను చేసిన మరో మంచి చిత్రం ‘ఓ బేబి’. మానవ జీవితాల్ని స్పృశించే కథ ఇది. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో పాటు మూడు సంస్థలు కలిసి నిర్మించాయి.‘ఈ సినిమా చూశావా?నీకేమనిపించింది’ అని సురేష్‌బాబుగారు అడిగారు. దాంతో పదిసార్లు ఎడిటింగ్‌ గదికి వెళ్లి ‘ఓ బేబి’ని చూశా. చూసిన ప్రతిసారీ మా అమ్మని గాఢంగా, ప్రేమతోహత్తుకోవాలనిపించింది. అమ్మ, నానమ్మలు ఇంటి కోసం త్యాగాలు చేయడం తప్ప, మనలాగా కలలు సాకారం చేసుకోవాలనే ఆశతో బతికేవారు కారు. నటనతోపాటు కొత్త యాసలో సంభాషణలు పలకడం సవాల్‌గా అనిపించింది. ఈ సినిమా నా కెరీర్‌లోనే ప్రత్యేకం. నాగశౌర్య ప్రత్యేక పాత్రలో నటించారు’’ అన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘కొరియాతో పాటు మరో ఏడు భాషల్లో రీమేక్‌ అయిన ఈ చిత్రం అన్ని చోట్లా విజయం అందుకొంది. ఈ సినిమాని చూసినప్పుడు ఇలాంటి కథలుంటాయా? అనిపిస్తుంది. కుటుంబవిలువలతో కూడిన కామెడీ ఈ సినిమాలోకనిపిస్తుంది’’ అన్నారు. నందిని రెడ్డి మాట్లాడుతూ ‘‘సమంత పాత్ర పలు ఛాయల్లో ఆసక్తికరంగా సాగుతుంది. లక్ష్మీభూపాల్‌ మాటలు, పాటలు చిత్రానికి ప్రాణం. మిక్కీ జె.మేయర్‌ చక్కటి సంగీతం అందించార’’న్నారు. కార్యక్రమంలో లక్ష్మీభూపాల్‌, సునీత, తేజ, జునైద్‌ తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.