ఇలాంటి సినిమాలు ప్రతి వారం రావాలి

‘‘ఓ బేబీ’ ఓ కొత్త ప్రయోగం లాంటి సినిమా. ఇలాంటి కథలు ఎంచుకోవడం సాహసమే’’ అన్నారు వెంకటేష్‌. సమంత కథానాయికగా నటించిన చిత్రం ‘ఓబేబీ’. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. నాగశౌర్య, రాజేంద్రప్రసాద్‌, లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. జులై 5న విడుదల అవుతోంది. శనివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చూశాను. నందిని ఈ సినిమాని బాగా తీర్చిదిద్దింది. కొత్త తరహా కథ ఇది. నటీనటులంతా చాలా బాగా చేశారు. బేబీగా సమంత అదరగొట్టింది. సినిమా మామూలుగా లేదు. సమంత సినీ జీవితంలోనే ఇది అత్యుత్తమ చిత్రం అనుకోవచ్చు. హావభావాలన్నీ చక్కగా పలికించింద’’న్నారు. రానా మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో పని చేసిన చాలా మందితో నాకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. కొత్త సినిమాలు తెలుగులో రావాలని ఎప్పుడూ అనుకునేవాడ్ని. ‘ఓ బేబీ’ లాంటి సినిమాలు ప్రతి వారం, ప్రతిరోజూ రావాలి. ఇలాంటి సినిమాలతో సురేష్‌ ప్రొడక్షన్స్‌లో కొత్త శకం ప్రారంభమైంద’’న్నారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నేను చూశాను. నందిని నా ఏకలవ్య శిష్యురాలు. క్లిష్టమైన సన్నివేశాల్ని కూడా చాలా బాగా తెరకెక్కించింది. రాజేంద్రప్రసాద్‌, రావురమేష్‌, లక్ష్మి పోటీపడి నటించారు. అందం, అభినయం ఉంటే.. కథానాయికలు అయిపోరు. మంచి పాత్రలు దక్కాలి. సమంత అలా వరుసగా మంచి మంచి పాత్రలతో దూసుకుపోతోంది. తనతో నేను సినిమా చేయలేదు. నా రాబోయే చిత్రంలో కనీసం అతిథి పాత్రలో అయినా తను నటిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘నందిని రెడ్డితో నా మూడో సినిమా. 50 సినిమాలు చేసినా రాని సంతృప్తి ఈ చిత్రంతో దక్కింద’’న్నారు రచయిత లక్ష్మీ భూపాల్‌. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మంచి పాత్రలు ఎంచుకోవడం వల్లే ఇన్నేళ్లుగా నటుడిగా నిలబడగలిగాను. ‘అహనా పెళ్లంట’ తరవాత సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నటించిన సినిమా ఇదే. అంతకంటే మంచి పాత్ర ఈ సినిమాతో దక్కింది. ఇందులో సమంతకూ, లక్ష్మికీ నేనే బోయ్‌ఫ్రెండ్‌ని. ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించిన అనుభూతి కలిగింద’’న్నారు. నందినిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అమ్మలందరికీ అంకితం. కుటుంబంతో చూడాల్సిన సినిమా. మన అమ్మలు, నాన్నమ్మలు మన కోసం చాలా చేశారు. కానీ వాళ్లకెప్పుడూ థ్యాంక్స్‌ చెప్పం. ఈ సినిమాతో వాళ్లకు కృతజ్ఞత చెప్పాలనుకున్నాం. ఈ చిత్రానికి అసలైన స్టార్‌ సమంతనే. తను ఎలా చేసిందో ఈ సినిమా విడుదల తరవాత ప్రేక్షకులే మాట్లాడతారు. ‘ఓ బేబీ’ని చాలా కాలం గుర్తుంచుకుంటార’’న్నారు. సమంత మాట్లాడుతూ ‘‘కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రం తీయడం ఈ రోజుల్లో చాలా కష్టం. నన్ను నమ్మి ఈ సినిమాని తీసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నా సినీ జీవితంలోనే అత్యుత్తమ పాత్ర ఇచ్చారు. ఈ కథని మేం ఎంచుకోలేదు. ఈ కథే మమ్మల్ని ఎంచుకుంది. నందిని నాకు ఓ అక్కలా మారిపోయింది. వందశాతం తనని నమ్మాను. ఆ నమ్మకం నా నటనలో కనిపిస్తుంది. ఓ పోస్టర్‌ చూడగానే సినిమాలో నిజాయతీ ఉందా, లేదా? అనేది ప్రేక్షకులకు అర్థమైపోతుంది. ప్రతి ప్రచార చిత్రం ఈ సినిమాపై నమ్మకం తీసుకొచ్చి ఉంటుంది. ఈ సినిమాకి రండి. మీరు ఏమాత్రం నిరుత్సాహపడరు’’అంది. కార్యక్రమంలో నాగశౌర్య, వివేక్‌ కూచిభొట్ల, సునీత, బీవీఎస్‌ రవి, అబ్బూరి రవి, నాగ అశ్విన్‌, ప్రగతి, తేజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.