‘మాభూమి’ లాంటి చిత్రం ‘పలాస 1978’

‘‘చిత్ర పరిశ్రమలో నలబై ఏళ్లుగా కొనసాగుతున్నానంటే అది సినిమాలపై ఉన్న తపన వల్లే. ఇన్నేళ్ల కెరీర్‌లో మరే చిత్రమూ ఇవ్వలేనంత తృప్తి ‘పలాస 1978’తో దక్కింద’’న్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించారు. రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సమర్పకులు తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. ‘మాభూమి’ తరహా చిత్రంలా అనిపించింది. అందుకే ఈ కథతో సినిమా చెయ్యొచ్చని ప్రసాద్‌కు సూచించా. నిజానికి ఈ చిత్ర ఇంత చక్కగా నిర్మాణంలో పూర్తి చేసుకుందంటే అది ఆయన వల్లే. ఏదో స్నేహం కొద్దీ నా పేరు వేస్తానంటే సరే అన్నా అంతే. ఇప్పుడు గాంధీ, అంబేడ్కర్‌ వంటి గొప్ప వ్యక్తుల ఆశయాల్ని పక్కకు తోసేసి వాళ్ల విగ్రహాలను వీధుల్లో పెట్టుకుంటున్నాం. అందుకే ఈరోజుకీ ఊళ్లలో హరిజన వాడలుంటున్నాయి. కులమతాల మధ్య అంతరాలు అలాగే ఉంటున్నాయి. పట్టణాల్లో పెద్దగా కనపడట్లే కానీ, ఊళ్లలో నేటికీ జనం వాళ్లలో వాళ్లు కొట్టుకునే పరిస్థితులుంటున్నాయి. ఇప్పుడిలాంటి అంశాలనే ‘పలాస’తో ఎంతో వాస్తవికంగా సహజత్వం ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. ‘శంకరాభరణం’, ‘మాభూమి’ వంటి వాస్తవికతకు దగ్గరగా ఉన్న కల్ట్‌ చిత్రాలు చూసినప్పుడు నాకు ఆ తరహా ప్రయత్నాలు చెయ్యాలనిపించేది. కానీ, కుదర్లేదు. అందుకే ఇప్పుడింత గొప్ప చిత్రం నా పేరు మీదుగా వస్తున్నందుకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. కరుణ సినిమా పట్ల తనకున్న తపన, పట్టుదల, నిష్ఠను దాన్ని తెరపైకి తీసుకురావడంలో ఎంతో చక్కగా చూపించారు. ఈ చిత్రం కోసం నటుడిగా, నిర్మాతగా రక్షిత్‌ పెద్ద సాహసమే చేశాడు. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాత్మక కథల విషయంలో ఫలితం కాస్త అటు ఇటైనా ఆర్థికంగా, కెరీర్‌ పరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంద’’న్నారు. ‘‘ఓడిపోయిన వాళ్లలో ఎంత నిజాయితీ ఉన్నా వాళ్ల కథలు చరిత్రకెక్కవు. ఇప్పుడీ చిత్రంతో అలాంటి ఓటమి చెందిన వ్యక్తుల కథనే చూపించబోతున్నాం. కొన్ని కుల వర్గాల వల్ల ఎవరైతే పీడించబడుతున్నారో వాళ్ల కోణంలో కథ చెప్పాం. కాబట్టి ఇది కొందరికి తమనే లక్ష్యంగా చేసుకోని తీశారేమోనన్న అనుభూతి కలగొచ్చ’’న్నారు నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.