సాహిత్య విలువలపై వేదనకి గురవుతా!

‘‘అపారమైన చరిత్ర ఉంది మనకు. మనకున్న సాహిత్యం, శక్తి గురించి ఒక తరానికి తెలియదు. కానీ అది అర్థం చేసుకొంటే ప్రపంచాన్ని శాసించే గొప్ప సినిమాలొస్తాయి’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలిలో జరిగిన ‘మన సినిమాలు’ పుస్తకావిష్కరణకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ పాత్రికేయుడు తెలకపల్లి రవి రచించిన పుస్తకం అది. పుస్తకావిష్కరణ అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘చాలామంది అనుభవజ్ఞులు, మేధావుల ఆలోచనతో కూడిన కలయికే ఈ పుస్తకం. తెలకపల్లి రవి సంపాదకత్వంలో వచ్చిన ‘మన సినిమాలు’ పుస్తకం సినీ అనుభవాలు, చరిత్ర, పరిణామ క్రమాన్ని తెలియజేస్తోంది’’ అన్నారు.


అలాంటి చిత్రాలకి పుస్తకాలే ప్రేరణ
సినిమా చరిత్రని నిక్షిప్తం చేయడానికి ప్రత్యేకంగా కమిటీ వేస్తే, అందులో సభ్యుడిగా ఉంటూ నా వంతు కృషి చేస్తానన్నారు పవన్‌కల్యాణ్‌. ‘‘నటి సావిత్రి గొప్పతనం నేటి తరానికి సినిమా తీసేవరకు తెలియదు. ఒక తరానికి ఎస్వీఆర్‌ ఎవరో తెలియదు. ‘మహానటి’కి జాతీయ పురస్కారాలు రావడం ఎంతో ఆనందం. అలాంటి సినిమాలు రావడానికి పుస్తకాలే ప్రేరణగా నిలుస్తున్నాయి. రాబోయే ‘సైరా నరసింహారెడ్డి’ కూడా చరిత్ర నుంచి రాబోతున్నదే’’ అన్నారు పవన్‌.

సినిమాలే సమాజం
వందేళ్ల సినిమా వైభవానికి నీరాజనంలా, ఒక ప్రతిబింబంలా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చామన్నారు రచయిత తెలకపల్లి రవి. ‘‘కె.విశ్వనాథ్‌, గొల్లపూడి తదితర ప్రముఖుల స్వీయానుభవాలు కూడా ఇందులో ఉంటాయి. టెలివిజన్‌ వచ్చాక సినిమా ఎలా మారింది?
బాహుబలిగా చూపిస్తే తప్ప చూడలేని స్థితి ఎందుకొచ్చిందనే అంశాలు ఇందులో ఉంటాయి. ఇంకా రెండు మూడు పుస్తకాలు అందించబోతున్నాం’’ అన్నారు. సభకి అధ్యక్షత వహించిన తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘‘వందేళ్ల తెలుగు సినిమా చరిత్రని సేకరించి చాలామందికి తెలియని విషయాల్ని ఇందులో చెప్పారు రచయిత’’ అన్నారు. రచయిత, నటుడు రావికొండలరావు మాట్లాడుతూ ‘‘అన్ని భాషలవారికీ వాళ్ల వాళ్ల సినిమాల చరిత్రలు ఉన్నాయి కానీ.. తెలుగు సినిమాకి మాత్రం లేదు. దీనిపైన పరిశ్రమ పెద్దలతో పాటు ప్రభుత్వం, పాత్రికేయులు కూర్చుని ఒక కమిటీ వేయాలి’’ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ పుస్తకంలో తెలుగు సినిమా చరిత్ర అద్భుతంగా లభిస్తుంది. సారా నిషేధం ఒక సినిమావల్లే అయ్యింది. మౌనపోరాటం అనే మాట కూడా సినిమా నుంచే వచ్చింది. సినిమా ద్వారా వెళ్లే సందేశం వంద సభలు పెట్టేదానికంటే ఎక్కువ’’ అన్నారు. సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ ‘‘నేటి యువతరానికి ఈ పుస్తకం అవసరం. సినిమా ఎన్ని ఆకాశ శిఖరాల్ని పాదరక్షలుగా చేసుకొందనేది ఇందులో చదవొచ్చు’’ అన్నారు. కార్యక్రమంలో రెంటాల జయదేవ, నవ తెలంగాణ, ప్రజాశక్తి మేనేజర్‌ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


గబ్బర్‌సింగ్‌ విజయం కంటే ఎక్కువ ఆనందం

‘‘చిన్నప్పుడు తెలుగు అనువాదాలు ఎక్కువగా చదివేవాణ్ని. బంధోపాధ్యాయ రాసిన ‘వనవాసి’ అనే పుస్తకం అప్పట్లో చదివాను. ‘గబ్బర్‌సింగ్‌’ హిట్టు అయినప్పుడు కూడా కలగనంత ఆనందం, ఆ పుస్తకం చదివినప్పుడు కలిగింది. ఒకపుస్తకం తాలూకు శక్తి చాలామందికి తెలియదు. సాహిత్య విలువలపై ఎంతో వేదనకి గురవుతుంటా’’ అన్నారు పవన్‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.