ప్రతి కొంపలో ఇదే గొడవ

పిల్లల్ని ఇంజినీరింగ్‌ చదివించడం, తర్వాత అమెరికా పంపించడం... అక్కడ స్థిరపడ్డారని చెప్పుకోవడమే పరమావధిగా భావిస్తున్న మధ్య తరగతి తెలుగు కుటుంబాలపై విసిరిన వ్యంగ్యాస్త్రమే ఈ చిత్రం అంటున్నారు సుజై, సుశీల్‌. ఈ ద్వయం దర్శకత్వం వహిస్తూ, ఎ.అప్పిరెడ్డితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రెజర్‌ కుక్కర్‌’. ప్రతి ఇంట్ల ఇదే లొల్లి... అనేది ఉపశీర్షిక. సాయి రొనాక్‌, ప్రీతి అష్రాని జంటగా నటించారు. శనివారం హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్‌ని డి.సురేష్‌ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అన్నదమ్ములైన సుజై, సుశీల్‌ సినిమాపై తపనతో ఇండియాకి వచ్చారు. ఇలాంటి కొత్తతరాన్ని ప్రోత్సహించాల’’న్నారు. సుజై మాట్లాడుతూ ‘‘ఏం చేసైనా అమెరికా వెళ్లాలనుకొని అష్టకష్టాలు పడిన కిషోర్‌ అనే యువకుడి చుట్టూ సాగే చిత్రమిది’’ అన్నారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఒక మంచి సందేశాత్మక చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.