ఉద్యోగాలు చేస్తూనే సినిమాలు తీశాం..
‘‘మా జీవితాల్లోనూ, మేం గమనించిన విషయాలతోనూ అల్లుకున్న కథతోనే ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అంటున్నారు సుజోయ్, సుశీల్‌. అన్నదమ్ములైన ఈ ద్వయం అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు తిరిగొచ్చిన వీళ్లు సినిమా రంగంలోకి ప్రవేశించారు. తొలి ప్రయత్నంగా ‘ప్రెషర్‌ కుక్కర్‌’ తెరకెక్కించారు. అప్పిరెడ్డితో కలిసి వాళ్లే స్వయంగా నిర్మించారు. సాయిరోనక్, ప్రీతి అన్సారి, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రధారులుగా నటించిన ఆ చిత్రం ఈ నెల 21న వస్తోంది. ఈ సందర్భంగా దర్శకద్వయం సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.


*
‘‘తమ పిల్లల్ని అమెరికా పంపడమే కలగా భావించే తల్లిదండ్రుల్ని చూస్తూనే ఉంటాం. ఇలా నవతరంపై ఏదో రకంగా ఒక ఒత్తిడనేది ఉంటుంది. ఆ ఒత్తిడి మధ్య వాళ్లు ఎలా నలిగిపోతున్నారు? నవతరం ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? తదితర విషయాల ఆధారంగా రాసిన కథ ఇది. హాస్యం ప్రధాన చిత్రమిది’’.

* ‘‘మేం కూడా అమెరికా వెళ్లొచ్చిన వాళ్లమే. 80ల్లో, 90ల్లో తమ పిల్లల్ని అమెరికాకి పంపిన తల్లిదండ్రులు, ప్రస్తుతం ‘బిడ్డా... వచ్చేయండి’ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగాలు చేస్తూనే ఈ సినిమాని తీశాం. తొలి ప్రయత్నం కాబట్టి కొన్ని కష్టాలు ఎదుర య్యాయి. వాటిని అధిగమిస్తూ వచ్చాం. మన కథలో కొత్తదనం ఉంటే అదే అన్ని సమస్యలకీ పరిష్కారం చూపిస్తుంది. సినిమా నచ్చి అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది. తదుపరి మేం తీయబోయే చిత్రాల కోసం మరో ఆరు కథలు సిద్ధం చేసుకున్నాం’’.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.