నా పిచ్చి మాటలకి సారీ సార్‌!

ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సందర్భంలో నోరు జారడం సహజం. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్‌ కూడా ఓసారి నోరు జారాడు. అదీ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర. అనుష్క సినీ రంగంలో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ సమావేశంలో పూరి మాట్లాడుతూ ఆ ఆసక్తికర విషయాలు వివరించారు. ‘‘అప్పుడు ‘సూపర్‌’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అదే సమయంలో రాఘవేంద్రరావు నాగార్జున కోసం సెట్టుకు వచ్చారు. నేను రాఘవేంద్రరావు గారిని కలవడం అదే మొదటి సారి. ‘ఎందుకు వచ్చారు సార్‌’ అని ఆరా తీశా. ‘నాగార్జున డేట్స్‌ కావాలి. అందుకే ఇక్కడికి వచ్చా’ అని ఆయన జవాబిచ్చారు. సర్‌ నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు మీరు తీసిన ‘అడవి రాముడు’ సినిమా చూశాను. ఇప్పుడు నేను దర్శకుణ్ని అయ్యి నాగార్జునతో సినిమా చేస్తున్నా. మీరు వెంటనే డైరెక్టర్‌గా రిటైరైపోండి అంటూ అన్నాను. ఆయన నవ్వి నా భుజం తట్టి వెళ్లిపోయారు. అప్పుడు నేనేమో నాగార్జునతో ఫ్లాప్‌ సినిమా చేశా. ఆయన ‘అన్నమయ్య’లాంటి బ్లాక్‌బాస్టర్‌ తీశారు. అప్పుడు నేను అన్న పిచ్చిమాటలకు సారీ సార్‌’’ అంటూ అప్పుడు జరిగిన తప్పిదానికి దర్శకేంద్రుడికి క్షమాపణలు చెప్పారు పూరి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.