ఎవరూ తప్పించుకోలేరు

శివ కంఠమనేని కథానాయకుడిగా సంజీవ్‌ మేగోటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. ‘క్రిమినల్స్‌ కాంట్‌ ఎస్కేప్‌’ అనేది ఉపశీర్షిక. రాశి, నందితా శ్వేతా, అజయ్‌ ఘోష్, పోసాని కృష్ణమురళీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.ఎస్‌.శంకర్‌ రావు, ఆర్‌.వెంకటేశ్వర రావు, జి.రాంబాబు యాదవ్‌ నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్నేహా గుప్తాపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘చాలా కాలం తర్వాత తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. కథానాయకుడు క్రిమినాలజీ ప్రొఫెసర్‌గా కనిపిస్తారు. పోలీసులకు ఛేదించలేని నేరాలనూ అతనెంతో చాకచక్యంగా పరిష్కరిస్తుంటాడు. నందిత తొలిసారి గ్లామర్‌ పాత్రను పోషిస్తోంది. రాశికి చక్కటి రీ ఎంట్రీ అవుతుంద’’న్నారు. ‘‘దర్శకుడు కథ ఎంత బాగా చెప్పారో.. అంతే చక్కగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాంబాబు యాదవ్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.