రాహుల్‌ గాంధీ బయెపిక్‌ టీజర్‌ విడుదల

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జీవిత కథతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘మై నేమ్‌ ఈజ్‌ రాగా’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి రూపేష్‌ పాల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో తెరకెక్కించిన ‘కామసూత్ర త్రీడీ’, ‘సెయింట్‌ డ్రాకులా త్రీడీ’ చిత్రాలు కేన్స్‌లో ప్రదర్శితమయ్యాయి. తాజా చిత్రంలో రాహుల్‌ గాంధీగా అశ్వినీ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అందులో రాహుల్‌తో పాటు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ తదితరుల పాత్రలూ కనిపించాయి. రాహుల్‌ బాల్యంలో నాన్నమ్మ ఇందిర హత్యకు గురి కావడం, ఆ విషాదంలో తండ్రి రాజీవ్‌ను ‘మిమ్మల్ని కూడా చంపేస్తారా’ అని రాహుల్‌ భయంగా అడగడం, తల్లి సోనియాతో అనుబంధం, మన్మోహన్‌ సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను రాహుల్‌కు అందిస్తూ ‘ఇక మీ సమయం వచ్చింద’ని చెప్పడం, విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ ‘మీరు ఓడిపోయారనుకుంటున్నారా’? అన్న ప్రశ్నకు అవునని సమాధానమివ్వడం, ‘మళ్లీ ఓడిపోతారా’ అని అడిగినా అవుననే చెప్పడం లాంటి సన్నివేశాలున్నాయి. ‘‘రాహుల్‌ గాంధీని కీర్తించడానికి ఈ చిత్రం తీయడం లేదు. అనేక రూపాల్లో దాడులకు గురైనా, ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కథ ఇది. వైఫల్యాలను ధైర్యంగా అంగీకరించి పోరాడేవారికి ఈ చిత్రం నచ్చుతుంద’’న్నారు దర్శకుడు. సార్వత్రిక ఎన్నికల లోపు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.