‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ గుట్టు విప్పేశారు..

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)కు సంబంధించిన వివరాలను ఎట్టకేలకు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యంగ్ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ల, నిర్మాత దానయ్య కూడా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నారు.
సినిమా వచ్చేది అప్పుడే..: దానయ్య


భారతదేశం గర్వించే దర్శకుడు రాజమౌళితో సినిమాను తెరకెక్కించడం నా అదృష్టం. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌, పుణెలో మరో షెడ్యూల్‌ ఉంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్నాం. ఎక్కడా రాజీపడటంలేదు. సినిమాను 2020 జులై 30 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి కూడా రిక్వెస్ట్స్‌ వస్తున్నాయి. అన్ని భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌చేస్తున్నాం.’’


‘‘ఈరోజు చాలా టెన్షన్‌గా ఉంది. ఇది జక్కన్నతో నాలుగో చిత్రం నాది. అన్నింటికంటే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఫీలవుతున్నాను. నా కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోతుంది, ఎందుకంటే జక్కన్నతో పనిచేయడం దాంతో పాటు చరణ్‌తో కలిసి తెరపంచుకోబోతున్నాను. మా ఇద్దరి స్నేహం ఈ సినిమాతో మొదలవ్వలేదు. నాకు తెలిసిన మంచి మిత్రుడు. నా కష్ట సుఖాలు పంచుకునే మిత్రుడు చరణ్‌. ఈ సినిమా మేం కలిసి చేసేసరికి వేరే లెవల్‌కు వెళ్లిపోయింది మా స్నేహం. మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే స్నేహితులుగా మిగిలిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మాకు ఎలాంటి దిష్టి తగలకూడదు. అల్లూరి, భీం గురించి తెలిసిన గీత ఒకటి ఉంది. ఇప్పుడు వారిద్దరూ మనకు తెలీని గీత గురించి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో చూస్తారు. ఈ సినిమా నాకు, చరణ్‌కు నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ సినిమా ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్‌ షాప్స్‌, శిక్షణ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు చేసిన 28 సినిమాల కంటే ఈ సినిమా కోసం తీసుకున్న శిక్షణ మా భవిష్యత్‌ సినిమాలకు ఎంతో సహాయపడుతుందని చెప్పగలను. మేం తీసుకున్న శిక్షణ వర్ణనాతీతం. రాజమౌళి బుర్రలో పుట్టిన ఈ ఆలోచన ఓ గొప్ప చిత్రంగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. నటులుగా ఈ చిత్రంలో మేం పాల్గొనడం మా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు జక్కన్నకు ధన్యవాదాలు. ఈ సినిమాలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎటువంటి విభేదాలూ లేకుండా చరణ్‌ ఒప్పుకొన్నందుకు హ్యట్సాఫ్‌ చెప్పాలి. మా తరంలో ఈ సినిమా రాబోతోందని చాలా సంతోషంగా ఉంది. అది కేవలం జక్కన్నపై మాకున్న కాన్ఫిడెన్స్‌ వల్లే అవబోతోంది’’.


ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అలా మొదలైంది
: చరణ్‌
‘ఇది నిజంగా జరుగుతోందా లేదా అన్నది కూడా ఇంకా నమ్మలేకపోతున్నాను. రాజమౌళితో మళ్లీ పనిచేయాలనుకున్నాం. కానీ తారక్‌తో కలిసి ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు. ఈ ప్రాజెక్ట్‌ ఎలా మొదలైందనేది నా ఆసక్తి. ఒకరోజు ఊరువెళ్తున్నప్పుడు ఆయన ఇంటికి రమ్మన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లగానే ఒక మంచి పోజ్‌లో తారక్‌ కింద నేల మీద రిలాక్స్‌ అయి కూర్చున్నారు. తారక్‌కు నేనొస్తానని తెలీదు. నాకూ తనొస్తాడని తెలీదు. అలా ఇద్దరం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. మా ఇద్దర్నీ లోపలికి తీసుకెళ్లి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ గురించి చెప్పారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇద్దరం ఆయన్ను కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్పాం. ఆ తర్వాత తీసిన ఫొటోనే మీరు చూశారు. అద్బుతమైన, గౌరవప్రధానమైన పాత్రల్లో నటిస్తున్నాం. మేం కూడా చాలా జాగ్రత్తగా నటిస్తున్నాం. నా సోదరుడు తారక్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఇంకా మా పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ మొదలుకాలేదు.’’


సీతారామరాజుగా చరణ్‌.. కొమురం భీంగా తారక్‌
: రాజమౌళి
‘‘ఇలాంటి కథకు మాకు సహాయపాత్రలు కూడా భారీగానే ఉండాలి. మాకు అంతే భారీ తారాగణం ఉంది. అజయ్‌ దేవగణ్‌ సినిమాకు ఒప్పుకొన్నారు. ఆయన కీలక పాత్ర ఇచ్చాను. మెసేజ్‌ పెట్టగానే ఓకే అన్నారు. డేట్స్‌ ఎప్పుడు కావాలని అడిగారు. ఆయనకు పాత్ర చాలా నచ్చింది. ఆలియా భట్‌ చరణ్‌కు జోడీగా నటిస్తారు. ఆమె కూడా చాలా ఆత్రుతగా ఉన్నారు. ఏ పాత్రైనా చేస్తాను అన్నారు. తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్జియోన్స్‌ చేస్తున్నారు. సముద్రఖని కూడా ఉన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నారు. వర్కింగ్‌ టైటిల్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌. కానీ డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి చాలా మంది ‘బాగుంది దాన్నే టైటిల్‌ పెట్టండి’ అంటున్నారు. కానీ సినిమాకు అన్ని భాషల్లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే కామన్‌ టైటిల్‌ ఉంటుంది. టైటిల్‌ మాత్రం ఒక్కో భాషలో ఒక్కో విభిన్న టైటిల్‌ ఉంటుంది. అయితే టైటిల్‌ను మాత్రం ఇప్పుడే చెప్పలేను. అభిమానులనే టైటిల్‌ను గెస్‌ చేయమంటున్నాం. ఇప్పటికైతే టైటిల్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే అనుకుంటున్నాం. సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రను తారక్‌ చేస్తారు.’’

ఇదీ కథ: రాజమౌళి
‘‘దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రెస్‌ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా నమ్మకం ఏంటంటే.. ప్రేక్షకులు సినిమాకు వచ్చే ముందు సినిమా ఎలా ఉండబోతోంది అన్న అంచనాలు పర్‌ఫెక్ట్‌గా ఉండాలని నేను నమ్ముతాను. అందుకే నేను ప్రేక్షకులకు ముందే సినిమా గురించి చెప్పడానికి ఇష్టపడతా. 1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఆంగ్లమే కాకుండా వేదాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యుక్తవయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడు సంవత్సరాలు పాటు ఇంటిపట్టున లేరు. తిరిగొచ్చాక ఆయన స్వతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మనకు తెలిసిందే.

1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయనకు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక చదువకుని వచ్చారు. ఆయన కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. అల్లూరిలాగే కొమురం భీం పోరాడారు. వాళ్ల చరిత్ర నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదే మేం సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింది.’’
ప్రెస్‌మీట్‌కు తారక్‌, రామ్‌చరణ్‌ కొత్త తరహా మీసకట్టుతో హాజరయ్యారు. ఇద్దరూ ఒకేరకమైన మీసం కట్టుతో రావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.