50 చిత్రాల అనుభవం ఉంటేనే ఇది సాధ్యం!!

‘‘ఇప్పుడు ప్రపంచం ఎంతో మారిపోయి ఉండొచ్చు. ప్రజల జీవనశైలిలో అనేక మార్పులు వచ్చి ఉండొచ్చు. కానీ, సమాజంలో ఓ మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు మాత్రం ఏ మాత్రం మారలేదు. ‘తోలుబొమ్మలాట’ చిత్రంతో ఈ బంధాల్లోని గొప్పతనాన్ని.. వాటి మూలాలను ప్రతిఒక్కరికీ గుర్తుచేయబోతున్నాం’’ అన్నారు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. విశ్వంత్, హర్షిత చౌదరి, వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో విశ్వనాథ్‌ మాగంటి దర్శకుడిగా తెరకు పరిచయమవుతున్నారు. దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించారు. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘నేను నటుడిగా ఎన్ని వందల చిత్రాలు చేసినా.. ఓసారి వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు నా కెరీర్‌లోని ఐదు అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం ఉంటుంది. కొంత మంది పుట్టుకతో వృద్ధులంటారు. దర్శకుడు విశ్వంత్‌ అలాంటి వాడే. నిజానికి ఇలాంటి చిత్రం చేయాలంటే 50 సినిమాల అనుభవం ఉండాలి. కానీ, విశ్వంత్‌ తొలి చిత్రంతోనే ఆ అద్భుతాన్ని చేసి చూపాడు. స్నేహంలోని మాధుర్యాన్ని స్నేహితుడి గొప్పతనాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి ఇచ్చిన స్వరాలు వింటే మరో ఇళయరాజాని చూసినట్లనిపించింది. సతీష్‌ నటుడికి స్ఫూర్తినిచ్చే కెమెరామెన్‌ అనిపించుకున్నాడు. వయసు మళ్లిన పాత్రలోనూ నన్నెంతో అందంగా చూపించాడతను. ‘ఆ నలుగురు’ తర్వాత నాకు మళ్లీ అంత గొప్ప పాటలిచ్చారు రచయిత చైతన్య ప్రసాద్‌. ప్రతిఒక్కరి ఇళ్లలో దాచుకోగల గొప్ప చిత్రం ‘తోలుబొమ్మలాట’ అవుతుంది’’ అన్నారు. ‘‘ఓ ఇంట్లో బాధలు, కోపాలు, ఆనందాలు అన్నీ కలిసి ఎలా ఉంటాయో.. ఈ చిత్రం కూడా వాటన్నింటి కలయికలా కనిపిస్తుంది. కథ చెప్పినప్పటి నుంచి చిత్రీకరణ పూర్తయ్యే వరకు రాజేంద్రప్రసాద్‌గారు విలువైన సలహాలు సూచనలిచ్చారు. సెట్స్‌లో నటీనటులంతా అందించిన సహకారం మరువలేనిద’’న్నారు దర్శకుడు విశ్వనాథ్‌. 


యువ హీరో విశ్వంత్‌ మాట్లాడుతూ.. ‘‘విశ్వ నేను ‘కేరింత’తో మా కెరీర్లను మొదలుపెట్టాం. ఇన్నేళ్ల తర్వాత తన దర్శకత్వంలో సినిమా చేస్తుండటం సంతోషాన్నిచ్చింది. మా ఇద్దరి వయసులకు మించిన చిత్రమిది. కెరీర్‌ తొలినాళ్లలోనే రాజేంద్రప్రసాద్, దేవీ ప్రసాద్‌ వంటి సీనియర్‌ నటులతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం దక్కింది’’ అన్నారు. ‘‘రాజేంద్రప్రసాద్‌ నా తొలి గురువు. సెట్‌్్సలో నాకెన్నో విలువైన సలహాలిచ్చారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో నాకీ అవకాశం ఇచ్చినందుకు దర్శక,నిర్మాతలు ధన్యవాదాలు’’ అన్నారు కథానాయిక హర్షిత చౌదరి. ఈ కార్యక్రమంలో దేవి ప్రసాద్, నర్రా శ్రీనివాస్, నారాయణ రావు, కల్పన, మోహన్‌ కె.తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.