తలైవా మళ్ళీ మొదలెట్టాడు
రేపటితో ఏడు పదుల వయసులోకి చేరుకుంటున్నాడు సూపర్‌స్టార్‌ రజినికాంత్‌. ఇప్పుడు ఆయన చూపించే జోరు మాత్రం కుర్ర కథానాయకులకు సవాలు విసిరే విధంగా ఉంది. ఆయన నటించిన ‘దర్బార్‌’ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. రజిని తదుపరి చిత్రం మాస్‌ దర్శకుడు శివతో చేస్తానని ప్రకటించాడు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలని ఈ రోజు నిర్వహించాడు తలైవా. ఈ వేడుకలో దర్శకుడు శివ, మీనా, ఖుష్భూ, నిర్మాతలు మొదలగు చిత్ర బృందం పాల్గొన్నారు. దీనికి ‘తలైవర్‌ 168’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. ఇందులో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ముగ్గురు నాయికలున్న చిత్రంలో రజిని ఎటువంటి పాత్ర ధరిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రజిని సినిమాకి పనిచేయాలని చాలా మంది సంగీత దర్శకులకి ఉంటుంది. అందులో డి.ఇమాన్‌ ఒకరు. ఈ సినిమాతో ఆయన కల నెరవేరింది. మొదటిసారి ఇమాన్‌ రజిని సినిమాకి సంగీతం


సమాకూరుస్తున్నారు. 24 సంవత్సరాల తరువాత మీనా, 27 సంవత్సరాల తరువాత ఖుష్భూ రజినితో కలసి నటిస్తున్నారు. కీర్తికి మొదటిసారి రజినితో కలసి నటించే అవకాశం దొరికింది. రేపు తలైవా పుట్టినరోజు వేడుకలని అట్టహాసంగా నిర్వహించటానికి అభిమానులు సిద్ధం అవుతున్నారు. మలేషియాలో కూడా ఈ వేడుకలని ఒక థియేటర్‌లో నిర్వహించనున్నారు. రజిని పుట్టినరోజు సందర్భంగా రేపు ‘దర్బార్‌’ ప్రచారచిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.