నిర్మాతల్లో హీరో.. రామానాయుడు

‘‘నిర్మాతగా డి.రామానాయుడు మా అందరికీ మార్గదర్శి. ఆయనకి ఎవరూ సరిలేరు, సరిరారు’’ అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. గురువారం శతాధిక చిత్రాల నిర్మాత, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కార గ్రహీత అయిన డి.రామానాయుడు జయంతి. ఈ సందర్భంగా ఫిలింనగర్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణలో ఆవిష్కరించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఎంతోమంది నటులు, సాంకేతిక నిపుణుల్ని పరిశ్రమకి పరిచయం చేశారు డి.రామానాయుడు. అందులో నేను కూడా ఒకడిని. ఆయన నిర్మాణంలో నా తొలి సినిమాని చేయలేకపోయినా, వారి అబ్బాయి వెంకటేష్‌ తొలి సినిమాకి దర్శకత్వం చేసే అదృష్టం దక్కింది. డి.రామానాయుడు వారసత్వాన్ని నిర్మాణంలో సురేష్‌బాబు, నటనలో వెంకటేష్‌ నిలుపుతూ పేరు తెచ్చుకోవడం సంతోషకరం’’ అన్నారు. డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘చాలా భావోద్వేగభరితమైన రోజు ఇది. నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నేను, నా సోదరుడు సినిమా రంగంలోనే ఉన్నాం. మా కుటుంబం యావత్తూ సినిమారంగంలోనే పరిశ్రమిస్తోంద’’న్నారు. రమేష్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మాకు చెన్నై నుంచే రామానాయుడుగారితో అనుబంధం ఉంది. మహామనిషి. ఎందరికో సహాయ సహకారాలు అందించారు. ఆయనలాగా చేయడం మాలాంటివారి వల్ల కాదేమో!’’ అన్నారు. జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘‘చిత్రపరిశ్రమ కోసమే తపించిన నిర్మాత రామానాయుడు. ఫిలిం నగర్‌ ప్రాభవానికి నాంది పలికారు. చిత్ర పరిశ్రమాభివృద్ధికి కృషి చేశార’’ని అన్నారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘డి.రామానాయుడు పేరు మీద ఉత్తమ నిర్మాత అవార్డును ప్రవేశపెట్టి ఏటా ఒక నిర్మాతకి పురస్కారం అందజేస్తాం’’ అన్నారు. పరుచూరి బ్రదర్స్‌ మాట్లాడుతూ ‘‘తొలిసారి ఇద్దరు హీరోలతో ‘ముందడుగు’ సినిమాని తీశారు రామానాయుడు. దానికి మేమే రచన చేశాం. నిర్మాతల్లో హీరో రామానాయుడు’’ అన్నారు. ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘‘నా సినిమా విడుదలప్పుడు చాలా సాయం చేసేవారు రామానాయుడు. ఏ రంగంలో అయినా నెంబర్‌ వన్‌గా ఉండాలని ఆయన నాతో అనేవారు. అన్నట్టే ఆయన అలా ఉండేందుకు కృషి చేసి, అన్నిటా నెంబర్‌ వన్‌ అనిపించుకున్నార’’న్నారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్‌.నారాయణ, కైకాల సత్యనారాయణ, అనిల్‌ సుంకర, బి.గోపాల్‌, కాజా సూర్యనారాయణ, గిరిబాబు, ముత్యాల రాందాసు, విజయచందర్‌, ప్రతాని రామకృష్ణ గౌడ్‌, దగ్గుబాటి అభిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.