‘రంగు పడుద్ది’ అంటున్న హాస్య బృందం

అలీ, ధన్‌రాజ్‌, షేకింగ్‌ శేషు, జబర్దస్త్‌ అప్పారావు, హీనా షేక్‌, సుమన్‌ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘రంగు పడుద్ది’. శ్యాం ప్రసాద్‌ దర్శకుడు. మహేష్‌ రాఠీ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘రెండు బృందాలు ఓ బంగ్లాకి వెళ్తాయి. అక్కడ వాళ్లకు ఎదురయ్యే వింతలూ, విడ్డూరాల సమాహారమే ఈ చిత్రం. హారర్‌ కామెడీ నేపథ్యంలో సాగుతుంది. అయితే వినోదానికే పెద్ద పీట వేశామ’’న్నారు. చిత్ర సమర్పకుడు కిషోర్‌ రాఠీ మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘ఘటోద్కచుడు’లో ఏవీఎస్‌ ‘రంగుపడుద్ది’ అనే ఊతపదంతో నవ్వించారు. ఆ డైలాగ్‌ ఈ కథకి బాగా సరిపోతుందనిపించింది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. ‘మాయలోడు’లోని ‘చినుకు చినుకు అందెలతో’ అనే పాటని ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేశాం’’ అన్నారు. ‘‘మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. పది భాషల్లో డిజిటల్‌ వెర్షన్‌ విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.