డిస్కోని ఇష్టపడే గ్యాంగ్‌స్టర్‌ రవితేజ

కా
లం ఆగాలి... నా కాలి వేగం చూసి, లోకం సాగాలి... నా వేలి సైగే తెలిసి’ అంటున్నాడు రవితేజ. ఆ కథేమిటో తెలియాలంటే మాత్రం ‘డిస్కో రాజా’ చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నభా నటేష్, పాయల్‌ రాజ్పుత్, తాన్య హోప్‌ కథానాయికలు. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. ‘రమ్‌ పమ్‌ బమ్‌...’ అంటూ సాగే ఈ చిత్రంలోని గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన గీతమిది. కథానాయకుడు రవితేజ, బప్పీలహరి ఆలపించారు. పాట విడుదలని పురస్కరించుకొని దర్శకుడు మాట్లాడుతూ ‘‘డిస్కోని ఎక్కువగా ఇష్టపడే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో రవితేజ కనిపిస్తారు. 1980 నేపథ్యంలో సాగే కథ కావడంతో, హీరో నడవడికని తెలియజేసేలా ఈ పాట ఉండాలని అనుకున్నాం. అందుకు తగ్గట్టుగా రెట్రో బాణీనిచ్చారు. డిస్కో గీతాల్ని చేసిన బప్పీలహరి పాడితేనే ఈ పాటకి అందం వస్తుందని ఆయనతో పాడించారు. రవితేజ కూడా గొంతు కలిపారు. సైన్స్‌ ఫిక్షన్‌ కాన్సెప్ట్‌లో రవితేజ నటించడం ఇదే తొలిసారి. సంగీత దర్శకుడు తమన్, ఛాయాగ్రాహకుడు కార్తీక్‌ ఘట్టమనేని నా విజన్‌ని అర్థం చేసుకుని ఈ చిత్రానికి పనిచేశార’’న్నారు. తమన్‌ మాట్లాడుతూ ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు పాటకి జీవితాన్నిస్తారు. అప్పటి పాటలకి సంగీతం అందించిన 50 మంది వాయిద్యకారుల్ని సంప్రదించి వాళ్లతో ఈ పాట చేయించాం. పాత పాటల్ని తలపించేలా ఉన్నా... నవతరానికి కూడా నచ్చాలి. సంగీత దర్శకుడిగా నాకు చాలా సవాళ్లతో కూడిన సినిమా ఇది. నేపథ్య సంగీతం కూడా చాలా కొత్తగా ఉంటుంది. రవితేజతో నేను చేసిన 12వ సినిమా ఇది. 13వ సినిమాకి కూడా నేనే పనిచేస్తున్నా’’ అన్నారు. సునీల్‌ మాట్లాడుతూ ‘‘రవితేజతో కలిసి నేను బాగా ఆస్వాదిస్తూ చేసిన సినిమా ‘దుబాయ్‌ శీను’. ఇందులో కూడా మంచి కామెడీని ఊహించొచ్చు’’ అన్నారు. నభా నటేష్‌ మాట్లాడుతూ ‘‘రవితేజకి పెద్ద అభిమానిని నేను. ఆయనతో కలిసి తెరను పంచుకోవడం గొప్ప అనుభూతి. నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలోకనిపిస్తా. ఇందులో నా పాత్ర పేరు కూడా నభానే’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.