సమస్యల వల్ల పెద్ద సినిమాలు వదులుకున్నా
‘ఏ సాంకేతిక విభాగమైనా కథలో కలిసిపోయి సాగాలి. ఛాయాగ్రహణం కూడా అంతే’’ అన్నారు రిచర్డ్‌ ప్రసాద్‌. సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ‘కొత్త జంట’, ‘బాబు బంగారం’, ‘దోచేయ్‌’ తదితర చిత్రాలకు పనిచేశారు రిచర్డ్‌. ‘ఓ బేబీ’తో ఆయన ఖాతాలో మరో విజయం చేరింది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో రిచర్డ్‌ మాట్లాడారు.


*
‘‘ఫొటోగ్రఫీ కథపై ఆధిపత్యం చేయకూడదు. అందులో మిళితం కావాలి. నందినీరెడ్డి సూచనలతో ‘ఓ బేబీ’ని ఆవిధంగానే తెరకెక్కించాను. సినిమాకి చక్కటి ఆదరణ లభించింది. నా పనితనానికీ మార్కులు పడ్డాయి. ‘ఓ బేబీ’ విడుదలకి ముందు ప్రచార చిత్రం బాగుందని హాలీవుడ్‌ ఛాయాగ్రహకుడు నీరవ్‌షా అభినందిస్తూ ఓ సందేశాన్ని పంపారు. లొకేషన్‌ని, సెట్‌ని దృష్టిలో ఉంచుకుని లైటింగ్‌ సమకూర్చుకున్నాను’’.

* స్పీల్‌బర్గ్‌ ప్రేరణతో ఛాయాగ్రహకుణ్ని కావాలనుకున్నాను. విజువల్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పొందా. అడయార్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్లు సినిమాటోగ్రఫీ చేశా. ‘మనం’ చిత్రానికి పి.ఎస్‌. వినోద్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశా. రచయిత, దర్శకుడు కృష్ణచైతన్య నా మిత్రుడు. తన ద్వారా ‘స్వామి రారా’కి ఛాయాగ్రాహకుడుగా అవకాశం దక్కింది. ‘కొత్తజంట’లోని నా పనితనాన్ని కథానాయకుడు అల్లు అర్జున్‌ మెచ్చుకున్నారు. నాగచైతన్య వల్లే ‘ఓ బేబీ’ అవకాశం దక్కింది. నందిని ఆలోచనల్ని అర్థం చేసుకుని ‘ఓ బేబీ’కి పనిచేశాను. తన తదుపరి కొత్త చిత్రానికీ నన్నే ఛాయాగ్రహకుడిగా ఎంచుకున్నారామె’’.

* ‘‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చినా, వీసా సమస్య చేయలేకపోయా. మరో రెండు పెద్ద చిత్రాలూ వివిధ కారణాల వల్ల వదులుకోవాల్సివచ్చింది. నన్ను సినిమాటోగ్రాఫర్‌గా చూడాలని అమ్మ కోరిక. అది తీరకుండానే అమ్మ కన్ను మూసింది’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.