ముసుగులో దాగిన చీకటి కోణాలేంటి?

‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’, ‘ఒక క్రిమినల్‌ ప్రేమకథ’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్లతో దర్శకుడిగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఇప్పుడీ సిరీస్‌లో నుంచి ‘రొమాంటిక్‌ క్రిమినల్స్‌’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మనోజ్, వినయ్‌ మహదేవ్, అవంతిక, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు సంయుక్తంగా నిర్మించారు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘సమాజంలో అనేక రకాల ముసుగులు ధరించిన వ్యక్తులున్నారు. అలాంటి వాటిలోంచి ఓ ముసుగు వెనకున్న చీకటి కోణాల్ని ఈ చిత్రంతో ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నాం. వ్యసనం ఏదైనా సరే దానికి అలవాటు పడితే చివరకు దాని పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది చెప్పడమే మా చిత్ర లక్ష్యం’’ అన్నారు. మనోజ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి పరదా వెనుక ఓ రహస్యముంటుందని మేం చెప్పబోతున్నాం. పిల్లలు వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇందులో చూపించామ’’న్నారు. ‘‘సమాజంలోని రకరకాల వ్యసనాలను ఇందులో చూపించాం. నేనీ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నా’’ అన్నారు వినయ్‌. అవంతిక మాట్లాడుతూ ‘‘చిత్ర టైటిల్‌కు తగ్గట్లుగానే ఇందులో రొమాన్స్, క్రైమ్‌ అంశాలు పుష్కలంగా ఉన్నాయ’’న్నారు. నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ.. ‘‘నేను నిర్మించిన తొలి చిత్రమిది. చాలా మంది పెద్ద నిర్మాతలు కథ తమకు అమ్మమని సునీల్‌ను కోరినా.. నాపై నమ్మకంతో నాకీ అవకాశమిచ్చారు. మరి ఈ ముసుగు వ్యక్తులు ఎవరు? వాటి వెనుక దాగి ఉన్న నిజాలేంటి? అన్నవి మే 17న థియేటర్లలో చూపించబోతున్నాం’’ అన్నారు.


                                     


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.