నా తొలి హిందీ సినిమా ఇదే కాబట్టి ఆత్రుతగా ఉన్నా
‘‘నటుడిగా ‘బాహుబలి’ ప్రభావం నుంచి బయటికి రావడం అంత సులభం కాదు. ‘బాహుబలి’ చరిత్ర సృష్టించిన చిత్రం. ‘సాహో’ని ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే లక్ష్యంగా చేశాం. కాబట్టి ‘బాహుబలి’తో ‘సాహో’ని పోల్చి చూడాల్సిన అవసరం లేదు’’ అన్నారు ప్రభాస్‌. ఆయన కథా నాయకుడిగా నటించిన చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకుడు. యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల అవుతోంది. శనివారం ముంబయిలో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం పంచుకున్న విశేషాలివీ.


పోలీసు అధికారిగా నటించా: ప్రభాస్‌
‘‘ప్రేక్షకులకి విజువల్‌గా ఒక సరికొత్త అనుభూతిని పంచాలనే లక్ష్యంతోనే ‘సాహో’ చేశాం. ఇదొక లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కథ. ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు కేటాయించాక, మళ్లీ ఈ సినిమాకి రెండేళ్లు వెచ్చించడానికి నేను ఇష్టపడలేదు. ఇందులో క్లిష్టమైన యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. వాటికి సన్నద్ధం కావడానికే సమయం పట్టింది. ఈ సినిమా నిర్మాతలు నా స్నేహితులు. యాక్షన్‌ ఘట్టాలు తీస్తున్నప్పుడు రిస్క్‌ చేయొద్దని వారు వారించారు. సుజీత్‌ బలమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాడు. నేను పోలీసు అధికారిగా నటించా. ఇందులో మలుపులు ఆకట్టుకుంటాయి. అవి నా అభిమానుల్ని మరింతగా అలరిస్తాయని నమ్ముతున్నా. నా తొలి హిందీ సినిమా ఇదే కాబట్టి ఆత్రుతగా ఉన్నా. హిందీలో డబ్బింగ్‌ చెప్పడం కష్టమనిపించింది. తెలుగు నేర్చుకునే విషయంలో శ్రద్ధాకపూర్‌కి నేను పెద్దగా సాయం చేయలేదు. కానీ ఆమె హిందీ విషయంలో నాకు సాయం చేసింది’’.

 ఈ సందర్భంగా ఓ మహిళా విలేకరి ప్రభాస్‌ను ప్రశ్నిస్తూ.. ‘సర్‌.. మీకున్న క్రేజ్‌తో బాలీవుడ్‌ ఖాన్‌త్రయానికి (ఆమిర్‌, సల్మాన్‌, షారుక్‌)గట్టి పోటీనిస్తారా?’ అని ప్రశ్నించారు. ఇందుకు ప్రభాస్‌ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు మేడమ్‌. ఇక నేను బయలుదేరనా?’ అని చమత్కరించారు. అనంతరం.. ‘మీ ముంబయి ఫ్యాన్స్‌ కోసం హిందీలో మాట్లాడండి’ అని సదరు విలేకరి ప్రభాస్‌ను కోరారు. ఇందుకు ప్రభాస్‌.. ‘జై హింద్‌’ అని చెప్పారు. తనకు హిందీ చదవడం, రాయడం వచ్చు కానీ మాట్లాడటం రాదని ప్రభాస్‌ ఈ సందర్భంగా చెప్పారు. అందుకే ‘సాహో’ సినిమాలో హిందీ వెర్షన్‌కు సంబంధించిన డైలాగులు పలకడంలో తడబడ్డానని తెలిపారు. తన పాత్ర వరకు డబ్బింగ్‌ చెప్పించారని పేర్కొన్నారు. నేనూ ఫైట్లు చేశా: శ్రద్ధాకపూర్‌
‘‘కథ రీత్యా నేను కూడా యాక్షన్‌ ఘట్టాల్లో నటించాల్సి వచ్చింది. ప్రభాస్‌తో కలిసి నటించడం మంచి అనుభవం. ఆయనొక గొప్ప స్టారే కాదు, మంచి హృదయమున్న వ్యక్తి అని అందరికీ తెలుసు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నన్ను వారి కుటుంబంలో ఒకరిగా చూసింది. హైదరాబాద్‌కి ఎప్పుడు షూటింగ్‌కి వెళ్లినా చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌ నా రెండో ఇల్లు అయ్యింది’’.

గల్లీలో ఎవడైనా కొడతాడు
2 నిమిషాల 46 సెకన్ల నిడివిగల ‘సాహో’ ట్రైలర్‌ కనులవిందుగా సాగింది. యాక్షన్‌ ఘట్టాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. అదంతా ఒకెత్తైతే ప్రభాస్‌ కనిపించిన తీరు, ఆయన చెప్పిన సంభాషణలు మరో ఎత్తు. ‘గల్లీలో సిక్స్‌ ఎవడైనా కొడతాడు... స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్‌ ఉంటుంది...’ అని ప్రభాస్‌ చెప్పిన సంభాషణ ప్రధానాకర్షణ.

4500 తెరలపై విడుదల
‘‘మన దేశంలో రూపుదిద్దుకొన్న భారీ యాక్షన్‌ చిత్రమిది. ఉత్తర భారతదేశంలో 4500 పైచిలుకు తెరలపై పలు భాషల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రంతో దక్షిణాది పరిశ్రమలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంది’’. -
- హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.