ప్రేమ.. ఉత్కంఠ సమ్మేళనం ‘రాహు’
‘‘సినిమాలో నేను హీరోనా.. విలనా? అని ఆలోచించను. ఓ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడమే లక్ష్యం. విభిన్నమైన పాత్రలు చెయ్యడం ఇష్టం’’ అన్నారు అభిరామ్‌ వర్మ. ఆయన కథా నాయకుడిగా నటిస్తోన్న తొలి చిత్రం ‘రాహు’. కృతి గార్గ్‌ నాయిక. సుబ్బు వేదుల దర్శకుడు. 28న వస్తోంది. అభిరామ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ‘‘తొలి భాగం ప్రేమ కథ.. రెండో భాగం సస్పెన్స్‌తో కూడిన యాక్షన్‌తో నడుస్తుంది. లవర్‌బాయ్‌గా, పోలీస్‌గా కనిపిస్తా. కథ విన్న వెంటనే ఈ పాత్ర నా కెరీర్‌కు ఉపయోగపడుతుంది అనిపించింది. దర్శకుడు సినిమా కోసం బాగా కష్టపడ్డారు. నేను సినిమాల్లోకి రావడానికి కమల్‌హాసన్, మహేష్‌ బాబే స్ఫూర్తి. కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశా. అక్కడే థియేటర్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నా. ఇక్కడికొచ్చాక దేవదాస్‌ కనకాల వద్ద డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకున్నా. కొన్నాళ్లు ముంబయిలో మోడల్‌గా పనిచేశా. అదే సమయంలో దర్శకుడు తేజ నాకు ‘హోరాహోరీ’లో అవకాశమిచ్చారు. ప్రస్తుతం ‘ఏకం’ చిత్రంలో నటిస్తున్నా. కథలు రాయడమంటే ఇష్టం. నా కథతో ఓ లఘు చిత్రం తీశా’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.