బోలెడన్ని నవ్వులు.. చక్కటి సందేశం

సాయిధరమ్‌ తేజ్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. బన్ని వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. శుక్రవారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘అరవింద్‌ సర్‌కి ఓ చిన్న పాయింట్‌ చెప్పా. అది ఆయనకి బాగా నచ్చడంతో వారి సలహా మేరకు పూర్తి కథ సిద్ధం చేసుకోని సినిమా పట్టాలెక్కించాం. ఇందులో దాదాపు 30 మందికి పైగా భారీ తారాగణమున్నా ప్రతిఒక్కరి సహకారంతో చిత్రీకరణను ఆడుతూపాడుతూ పూర్తి చేసేశాం. నటీనటులంతా ఇది తమ సొంత కథ అన్నట్లుగా ఎంతో ఇష్టపడి చేశారు. ప్రతి కుటుంబానికి కనెక్ట్‌ అయ్యే కథ ఇది. రాశి పాత్ర చాలా ముద్దుగా ప్రతిఒక్కరూ ఇష్టపడేలా ఉంటుంది. నా గత చిత్రాల్లోలా ఇందులో హీరో పాత్రకి ఎలాంటి లోపాలు లేవు. మేం చెప్పాలనుకున్న సందేశాన్ని క్లాస్‌ పీకినట్లు కాకుండా ఎంతో వినోదాత్మకంగా చూపించబోతున్నాం. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రమిది. పసందైన విందు భోజనంలా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అన్నారు. ‘‘2014 తర్వాత మళ్లీ గీతా ఆర్ట్స్‌లో చెయ్యలేదు. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. చాలా మంచి కథ ఇది. ప్రేక్షకులు ఇందులోని పాత్రలకు కనెక్ట్‌ అవుతారు. మారుతి కథ చెప్పినప్పుడే ఎప్పుడెప్పుడు చేస్తానాని అని ఎదురుచూశా. అంత నచ్చేసింది. ఆయన కథే మమ్మల్నందరినీ ఇలా కలిపింది. సత్యరాజ్‌ తన పాత్రలో అద్భుతంగా జీవించారు. ‘సుప్రీం’లో బెల్లం శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చే పాత్రను ఇందులో చేసింది రాశి. టిక్‌టాక్‌ సెలబ్రిటీగా ఆమె నటన హైలైట్‌గా నిలుస్తుంది. శనివారం మూడో పాట విడుదల చేస్తున్నామ’’న్నారు సాయిధరమ్‌ తేజ్‌. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘మారుతిది ఓ ప్రత్యేక శైలి. సందేశాన్ని సైతం వినోదాత్మకంగా చెప్పే నేర్పరితనం ఆయనలోనే ఉంది. ఈ సినిమా చూసి కొందరు ఎన్నారైలు బాధపడతారు, మరికొందరు ఆనందిస్తారు. విదేశాల్లో ఉండి ఇక్కడి వారికి దూరమైపోతున్న ఎన్నారైలు ఎంత బాధపడిపోతున్నారన్నది దీంట్లో చూపిస్తున్నామ’’న్నారు. ‘‘నేనింత వరకు ఇంత చేసిన వాటిలో బెస్ట్‌ స్క్రిప్ట్‌ ఇదే. మారుతి చాలా క్లారిటీతో చిత్రాన్ని తెరకెక్కించారు. టిక్‌టాక్‌ అంటే పడిచచ్చే యువతిగా నా పాత్ర ప్రతిఒక్కరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. తేజుతో కలిసి రెండోసారి చేయడం మర్చిపోలేని జ్ఞాపకం’’ అంది రాశి. ఈ కార్యక్రమంలో శేఖర్‌ మాస్టర్, తమన్, బన్నివాసు, వంశీ తదితరులు పాల్గొన్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.