సామ్‌ పిచ్చికి ఓ చిరునామా దొరికింది


‘‘కొత్త తరహా సినిమా రావాలంటే కొన్ని అవాంతరాలు ఉంటాయి. వాటిని దాటుకుంటూ వచ్చి నిలబడడం చాలా కష్టం. అలా నిలబడిన సినిమా ‘ఓ బేబీ’. ఇలాంటి విజయాలు రాబోయే చిత్రాలకు స్ఫూర్తినిస్తాయ’’న్నారు రానా. సమంత కథానాయికగా నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినిరెడ్డి దర్శకురాలు. సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యూన్‌ హు, థామస్‌ కిమ్‌ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. రానా మాట్లాడుతూ ‘‘సమంతకు మంచి సినిమాల్లో నటించాలనే పిచ్చి. తన పిచ్చికి ఈ సినిమాతో ఓ చిరునామా దొరికింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో తను ఇక ఎన్ని సినిమాలైనా చేసుకోవచ్చు. అందరి హృదయానికీ హత్తుకున్న చిత్రమిది. కొరియన్‌ కథని తెలుగు సినిమాలా మార్చిన నందినికి హ్యాట్సాఫ్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. దానికి మించిన ప్రతిఫలం లభించింది. ఇక మీదట మరిన్ని మంచి కథలతో, మంచి పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తా’’ అంది సమంత. ‘‘ఈ జన్మకు ఇదే గొప్ప అనుభూతిలా అనిపిస్తోంది. ప్రేక్షకుల స్పందన చూస్తే కళ్లు చమరుస్తున్నాయి’’ అన్నారు నందిని రెడ్డి. ‘‘గొప్ప మాటలు చెప్పడానికి ఈ చిత్రం ఓ వేదికగా మారింది. సమంత లక్ష్మి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశార’’న్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్‌. ‘‘ఈ చిత్రంలో అన్నిరకాల భావోద్వేగాలూ ఉన్నాయి. అందుకే ప్రేక్షకులు ఆదరిస్తున్నార’’న్నారు వివేక్‌ కూచిభొట్ల. ఈ కార్యక్రమంలో తేజ, సునీత తాటి తదితరులు పాల్గొన్నారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.