‘శంకరాభరణం’.. ఒక పాఠ్యగ్రంథం

ప్పుడు చూసినా నలభై ఏళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతిని కలగజేసే చిత్రం ‘శంకరాభరణం’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌. ఆయన తెరకెక్కించిన ‘శంకరాభరణం’ విడుదలై ఈ నెల 2తో 40 ఏళ్లు పూర్తయ్యాయి. జె.వి.సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్‌ తదితరులు నటించిన ఆ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమిది. నలభయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో హైదరా బాద్‌లో ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషించిన చంద్రమోహన్‌ మాట్లాడుతూ ‘‘నలభయ్యేళ్ల తర్వాత కూడా సినిమా చూసి ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఇలాంటి స్పందనని చూడటం ఓ గొప్ప అనుభూతి. నేను, మా అన్నయ్య కె.విశ్వనాథ్‌ కలిసి విజయవంతమైన చిత్రాలు చేశాం. మా పెదనాన్నగారి అబ్బాయి ఆయన. మా ఇద్దరికీ వయసులో పన్నెండేళ్ల వ్యత్యాసం ఉంది. ఇందులో చిన్న పాత్ర కదా, పైగా అందరూ కొత్తవాళ్లే నటిస్తున్నారు, నేను చేయాలా వద్దా అనుకున్నా. ఈ సినిమా ఇలా అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతుందని అప్పట్లో అనుకోలేదు. మా అన్నయ్య వంద పుట్టిన రోజులు జరుపు కోవాలి. ‘శంకరాభరణం’ యాభయ్యేళ్ల వేడుకకి కూడా హాజరు కావాలి’’ అన్నారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం ‘శంకరాభరణం’. కె.విశ్వ నాథ్‌గారు మనకందించిన ఆ చిత్రం చిరస్మరణీయం’ అన్నారు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. నటుడు ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘ఒక పాఠ్య గ్రంథం ‘శంకరాభరణం’. ఇలాంటి సినిమాల్ని చూపిస్తూ, భవిష్యత్‌ దర్శకులకి ఎలాంటి సినిమాలు తీయాలో నేర్పించాలి’’ అన్నారు. దర్శకుడు హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ ‘‘మరొక ‘శంకరాభరణం’, మరొక ‘సాగర సంగమం’ సినిమాల్ని ప్రస్తుత దర్శకుల నుంచి ఆశించకూడదు. ఎందుకంటే కె.విశ్వనాథ్‌ అనే వ్యక్తి ఒక్కరే వీటికి చిరునామా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన వంశీతో పాటు తనికెళ్ల భరణి, కస్తూరి, ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్, కాశీ విశ్వనాథ్, తులసి, దశరథ్, ప్రవీణ్‌ వర్మ, అశోక్‌కుమార్, రమేష్‌ ప్రసాద్, అచ్చిరెడ్డి, మాధవపెద్ది సురేష్, డా.కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.