13 ఏళ్ల తర్వాత మళ్లీ ఏడిపించారమ్మా అంటున్నారు

‘‘అభిమానులు కానీ, సాధారణ ప్రేక్షకులు కానీ ‘దూకుడు’ తర్వాత ఎలాంటి అనుభూతికి గురయ్యారో ఈ చిత్రంతోనూ అదే అనుభూతికి గురయ్యారు. జనవరి 11నే సంక్రాంతి పండగ ఆనందాన్నిచ్చారు.ఈ సినిమాకి వచ్చిన వసూళ్ల గురించి మాట్లాడుకుంటుంటే అంతా ఒక మేజిక్‌లా అనిపించింది. నిజంగా ఇది మైండ్‌ బ్లాక్‌ అనుభవం’’ అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. దిల్‌రాజు సమర్పించారు. శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్‌ మీట్‌ని నిర్వహించారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘నేను ‘దూకుడు’ తర్వాత కథాబలమున్న చిత్రాలు చేశా. ‘ఎఫ్‌2’ సమయంలో అనిల్‌ రావిపూడి ఈ కథ చెప్పాక... ఈ సమయంలో నేనిది చేయడమే సరైందనిపించింది. ఆయన కూడా వెంటనే స్క్రిప్టు సిద్ధం చేశారు. అభిమానులు స్పందిస్తున్న విధానం చూసి ఓ కొత్త అనుభూతికి గురయ్యాను. దీనికి కారకులు అనిల్‌ రావిపూడే. ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతోందో ముందే ఊహించారాయన. విజయశాంతి తప్ప మరొకరు చేయలేరనిపించేలా భారతి పాత్రని పోషించారామె. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఇస్తున్నాడంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. మైండ్‌ బ్లాక్‌ పాటకి చాలా స్పందన వచ్చింది. ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ రానంత స్పందన ఈ పాటకి వచ్చింది. అనిల్‌సుంకర మా కుటుంబంలో ఓ భాగం. దిల్‌రాజు, నేను కలిసి డబుల్‌ హ్యాట్రిక్‌ కొడతాం. రష్మిక చాలా బాగా చేసింది’’ అన్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘ప్రతి చోటా బొమ్మ దద్దరిల్లిపోయిందనే మాటే వినిపిస్తోంది. దేశభక్తి, యాక్షన్, భావోద్వేగాలు, కామెడీ, సందేశం.. ఇలా ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నారు ప్రేక్షకులు. ఇందులో మేనరిజమ్స్‌ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. మహేష్‌ని అభిమానించే ప్రేక్షకుల మధ్య ఈ సినిమా చూస్తుంటే ఇది నేనే తీశానా అనిపించింది. అవకాశం ఇచ్చినందుకు మహేష్‌కి కృతజ్ఞతలు. రత్నవేలు, ప్రకాష్, దేవిశ్రీప్రసాద్‌.. ఇలా సాంకేతిక విభాగంలో అందరూ సహకారం అందించారు. ఒక గొప్ప పాత్రని చాలా సులభంగా, అనుభవంతో అద్భుతంగా పండించారు విజయశాంతి. పతాక సన్నివేశాలకి ముందు కన్నీళ్లు పెట్టించేలా నటించార’’న్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబుతో మూడు సినిమాలు చేశా. మూడూ విజయం సాధించినందుకు నిర్మాతగా చాలా ఆనందంగా ఉన్నా. అనిల్‌తో నాలుగు సినిమాలు చేస్తే నాలుగూ విజయాలే. దేవిశ్రీతో 12 సినిమాలు చేశాం. విజయశాంతి పునః ప్రవేశం ఇలాంటి సినిమాతో జరగడం ఆనందంగా ఉంది. ఇది మహేష్‌ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు. రష్మిక మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా నటించాలనేది నటుల ఆశ. అలాంటి అవకాశం ఈ సినిమాతో మరోసారి దొరికింది. డ్యాన్స్‌తో పాటు కామెడీ చేశా’’ అన్నారు. నటి సంగీత మాట్లాడుతూ ‘‘విరామం తర్వాత మళ్లీ ఈ సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టా. 80కి పైగా సినిమాలు చేశా. ఏ సినిమాకీ నా సినిమా అనే అనుభూతి కలగలేదు. ఈ సినిమాకి అలా అనిపించింది’’ అన్నారు. ‘‘మహేష్‌ అభిమానులు, కుటుంబ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అది ఇందులో ఉండేలా చూసుకున్నాం. మేం ఊహించిన దానికంటే పదింతలు ఎక్కువ స్పందన రావడంతో పాటు ఆ స్థాయి వసూళ్లు వస్తున్నాయి’’ అన్నారు అనిల్‌ సుంకర.  


విజయశాంతి మాట్లాడుతూ ‘‘13 ఏళ్ల తర్వాత ఒక మంచి సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు రావడం ఆనందంగా ఉంది. మంచి అనుభూతినిఇచ్చిందీ చిత్రం. చాలా మంది ఫోన్‌ చేసి మళ్లీ ఏడిపించారమ్మా అన్నారు. ‘ఒసేయ్‌ రాములమ్మ’, ‘కర్తవ్యం’, ‘ప్రతిఘటన’ చిత్రాల తరహాలో బరువైన పాత్ర ఇది. బ్యాలెన్స్‌ చేసుకుంటూ నటించా. చివరి సన్నివేశం చేస్తున్నప్పుడు నేను గ్లిజరన్‌ వాడకుండా సన్నివేశంలో లీనమై నటించా. మహిళలు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఈ సినిమా చూసొచ్చినవాళ్లు ప్రతి డైలాగ్‌ గుర్తుపెట్టుకుని చెబుతున్నారు. జవాన్ల తల్లులు ఎంత బాధపడతారో, వాళ్లు ఎన్ని త్యాగాలు చేస్తారో మాకు అర్థమైంది. ఇంత గొప్ప పాత్రని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవిశ్రీప్రసాద్, అజయ్, రామ్‌లక్ష్మణ్, యుగంధర్, తమ్మిరాజు, పల్లవి, కౌముది, చిట్టి, భాను తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.