కథ వినగానే థ్రిల్‌కి గురైయ్యాను

కొన్ని రోజులుగా కథా బలమున్న సినిమాలన్నీ విజయవంతం అవుతున్నాయి. మరొక మంచి కథతో ‘ఏదైనా జరగొచ్చు’ తెరకెక్కింది’’ అన్నారు నటుడు శివాజీరాజా. ఆయన తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. పూజా సోలంకి, సాషాసింగ్‌ కథానాయికలు. కె.రమాకాంత్‌ దర్శకుడు. సుదర్శన్‌ హనగోడు నిర్మాత. తమిళ నటుడు బాబీ సింహా విలన్‌గా నటించారు. రాఘవ, రవిశివ తేజ కీలక పాత్రధారులు. 23న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. శివాజీరాజా మాట్లాడుతూ ‘‘సినిమాకి రచయిత, దర్శకుడే ప్రాణం. మంచి కథని, ఒక మంచి దర్శకుడు తెరకెక్కించాడు. బాబీ సింహా లాంటి మంచి నటుడు కీలక పాత్ర చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. బాబీ సింహా మాట్లాడుతూ ‘‘ఈ కథ విన్నప్పుడు నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కథనం చాలా బాగుంటుంది. విజయ్‌రాజా బెరుకు లేకుండా నటించాడు’’ అన్నారు. ‘‘డార్క్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఏప్రిల్‌ 1న పుట్టిన ముగ్గురి జీవితాలు ప్రమాదంలో పడతాయి. వాళ్లు ఎలా బయటపడ్డారన్నదే కథ. జాషువా పోరాటాలు, బాబీ సింహా, అజయ్‌ ఘోష్‌ అభినయం ప్రధాన ఆకర్షణ’’ అన్నారు దర్శకుడు. ‘‘నా తొలి సినిమాలోనే బాబీ సింహాతో పనిచేయడం నా అదృష్టం. నేపథ్య సంగీతం మెప్పిస్తుంద’’న్నారు విజయ్‌రాజా. ఈ కార్యక్రమంలో అజయ్‌ ఘోష్‌, రచ్చరవి, ఎస్‌.బి.ఉద్ధవ్‌, జాషువా తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.