రెండేళ్లు ప్రయత్నించి ‘డి సినిమా’ తెచ్చాం

సినిమా డిజిటల్‌ డెలివరీ ధరలు నిర్మాతలకి అందుబాటులోకి రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు తెలంగాణ ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు. ధరలతో పాటు పైరసీని కూడా నియంత్రించగలిగే సేవలతో ‘డి సినిమా’ డిజిటల్‌ సర్వీసులు అందుబాటులోకి రానుండడం శుభపరిణామం అన్నారు. డిజిక్వెస్ట్‌ ఇండియా, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సంస్థల భాగస్వామ్యంతో డి సినిమా డిజిటల్‌ సర్వీస్‌ని త్వరలోనే తీసుకురానున్నారు. దానికి సంబంధించిన డెమోని బుధవారం హైదరాబాద్‌లోని ఎ.ఎమ్‌.బి. సినిమాస్‌లో నిర్వహించారు. డిజిక్వెస్ట్‌ సీఎండీ బసిరెడ్డి మాట్లాడుతూ ‘‘పైరసీ నిర్మూలన కోసం రెండేళ్లు ప్రయత్నం చేసి డి సినిమా సేవల్ని తెస్తున్నాం. దీని ద్వారా వచ్చే లాభాల్ని తెలుగు చలన చిత్ర సంస్థలు సమానంగా పంచుకుంటాయి. త్వరలోనే డి సినిమా సేవల గురించి అన్ని సంస్థలు కలిసి ఓ నిర్ణయం తీసుకోబోతున్నాయి’’ అన్నారు. ‘‘నిర్మాతల కష్టం పైరసీపాలు కాకుండా డి సినిమా సేవలు ఆరంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాల’’న్నారు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌. కె.ఎస్‌. రామారావు, సునీల్‌ నారంగ్‌, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌, మోహన్‌ వడ్లపట్ల, కె.మురళీమోహన్‌, వీరశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.