నా సినిమా.. నా ఇష్టం

తేజ దర్శకత్వం వహించిన చిత్రం ‘సీత’. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, కాజల్‌ జంటగా నటించారు. సోనూ సూద్‌, మన్నారా చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్‌ సుంకర, కిషోర్‌ నిర్మాతలు. ఈ నెల 24న విడుదల కానుంది. హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార చిత్రాన్ని కాజల్‌, సాయిశ్రీనివాస్‌, సోనూ సూద్‌ విడుదల చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘తేజ, కాజల్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, సోనూసూద్‌... ఈ నలుగురి కోసమే సీత పుట్టిందా అనిపిస్తోంది. సావిత్రిలాంటి వాళ్లు చేయదగ్గ సీత పాత్రలో కాజల్‌ చక్కగా ఇమిడింది’’ అన్నారు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ ‘‘ఈ కథని తేజ నాకెప్పుడో చెప్పారు. ప్రతి పాత్ర ప్రత్యేకమే. తేజ ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథకి తగ్గట్టే పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించా’’ అన్నారు. అనిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘సినిమాయే ప్రాణమనుకునే తేజలాంటి టెక్నీషియన్‌ని నేనింత వరకూ చూడలేదు. కాజల్‌ నటన చూస్తే కర్తవ్యం, ఒసేయ్‌ రాములమ్మా చిత్రాలు గుర్తొస్తాయి. సాయి నటన మరో స్థాయిలో ఉంటుంది’’ అన్నారు. సోనూసూద్‌ మాట్లాడుతూ ‘‘ఎన్ని భాషల్లో నటించినప్పటికీ నాకు తెలుగు అంటే ప్రత్యేక అభిమానం. నన్ను నటుడిగా నిలిపింది తెలుగు సినిమానే’’ అన్నారు. తేజ మాట్లాడుతూ ‘‘నాకు జడ్జిమెంట్‌ తెలియదు. నాకు తోచినట్టు సినిమా తీసేస్తా. ఎక్కడన్నా తప్పులుంటే తిట్టండి. బాగుంటే మెచ్చుకోండి. ‘సీత’ పూర్తయ్యాక పరుచూరి సోదరులకు చూపించా. కొన్ని మార్పులు చెబితే సరి చేసి మళ్లీ తీశాం. నాకు సినిమా తప్ప వేరే ఏం తెలియదు. నా నిర్మాతల అతి మంచితనం వల్లనే ‘సీత’ను ఇలా తీయగలిగా’’ అన్నారు. సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘నా జీవితంలో తేజలాంటి మనిషిని కలవలేదు. ఈ సినిమాలో నన్ను చూసి ఆశ్చర్యపోతారు. నటుడిగా నాకు గౌరవం తీసుకొస్తుంది’’ అన్నారు. కాజల్‌ మాట్లాడుతూ ‘‘తొలిసారిగా యాక్షన్‌ మిళితమైన పాత్రలో నటించా. ఇలాంటి పాత్ర దక్కడం అదృష్టం. తేజ నా గురువు... మార్గదర్శి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీభూపాల్‌, మహతి, మన్నారా చోప్రా, బిత్తిరి సత్తి, గిరి, అభిషేక్‌ అగర్వాల్‌, సురేందర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.