పవన్‌.. రజనీలను అనుకరించిన సాఫ్ట్‌వేర్‌

బుల్లితెర హాస్య కార్యక్రమం ‘జబర్దస్త్‌’తో కమెడియన్‌గా సినీప్రియులకు చేరువయ్యారు సుడిగాలి సుధీర్‌. ఇప్పుడాయన్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడు. కె.శేఖర్‌ రాజు నిర్మించారు. ధన్య బాలకృష్ణన్‌ కథానాయికగా నటించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇదొక రొమాంటిక్‌ కామెడీతో నిండిన చక్కటి వాణిజ్య విలువలున్న సందేశాత్మక చిత్రం. ఓ సరికొత్త ట్రెండింగ్‌ కాన్సెప్ట్‌ రూపొందుతోంది. చిత్రీకరణ పూర్తయింది. సుధీర్‌ - ధన్యాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తెరపై వాళ్లిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘10 ఏళ్ల క్రితం ఈ ఫిలిం ఛాంబర్‌ ముందు తిరిగుతూ నాలాంటి వాళ్లను ఇందులోకి రానిస్తారా అని అనుకునేవాడిని. అదృష్టవశాత్తూ.. ఇప్పుడు నా తొలి చిత్ర ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించుకోవడం సంతోషాన్నిస్తోంది. ఇందంతా ప్రేక్షకులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదాలే. ఈ చిత్ర విషయంలో నాకెన్నో సర్‌ప్రైజ్‌లు ఎదురయ్యాయి. తొలి చిత్రంతోనే ధన్య, గౌతం రాజు, రామ్‌లక్ష్మణ్‌ వంటి పెద్ద టెక్నీషియన్స్‌తో చేసే అవకాశం దక్కింది. నాకు స్కీన్‌ప్లే బేస్డ్‌ కథలంటే ఇష్టం. నేను ఆశించిన అంశాలన్నీ ఈ కథలో కనిపించాయి. ఈ చిత్రానికి కథే హీరో. ఇందులో నేను డ్యాన్స్, యాక్షన్‌ అన్నీ చేశాను. పవన్‌ కల్యాణ్, రజనీకాంత్‌లను నేను ఆరాధిస్తాను. వాళ్లిద్దరినీ ఈ చిత్రంలో అనుకరించా. నాకు సినిమాల్లోకి రావడానికి చిరంజీవి స్ఫూర్తి. నా తొలి చిత్రానికి నా పేరు మీద టైటిల్‌ పెట్టడం కూడా నాకు మరింత సంతోషాన్నిచ్చింద’’న్నారు సుధీర్‌. ‘‘నేను చిత్రసీమకు వచ్చి ఐదారేళ్లు అయిపోయింది. అందుకే కొత్త హీరోలతో చేయడం నచ్చక తొలుత ఈ చిత్రానికి నో చెప్పా. తర్వాత సుధీర్‌ చేస్తున్నారని తెలిసి సినిమా ఒప్పుకున్నా. చిత్ర ప్రారంభోత్సవం రోజు అతని క్రేజ్‌ చూసి షాక్‌ అయ్యా. నా స్నేహితులంతా సుధీర్‌ అభిమానులే. దర్శకుడికి ఇది తొలి చిత్రమైనా.. స్క్రిప్ట్‌ చూస్తే అలా అనిపించలేదు. ఆయన రచనలో ఎంతో పరిణితి కనిపించింది. కథలోని రొమాన్స్, కామెడీ, యాక్షన్‌ అన్నింటినీ ఎంతో చక్కగా బ్యాలెన్స్‌ చేశార’’న్నారు ధన్య బాలకృష్ణన్‌. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘కథ వినగానే చాలా బాగా నచ్చింది. బడ్జెట్‌ ఎక్కువైనా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. ఇందులో గద్దర్‌ అన్న ఓ పాట రాశారు. అది సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిసెంబరు తొలివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.