నేనొక గడ్డిపరకను అనుకుంటున్నా!
దిగ్గజ గాయకులు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్‌, చిత్ర ఒకే వేదికపైకి రానున్నారు. తెలుగు చిత్రాల్లో తాము పాడిన అపురూపమైన గీతాల్ని ఆలపించబోతున్నారు. ‘లెజెండ్స్‌’ పేరుతో నవంబరు 30న హైదరాబాద్‌లో ఓ కార్యక్రమం నిర్వహించబోన్నారు. బుక్‌ మై షో, ఎలెవెన్‌ పాయింట్‌ టూ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘‘తెలుగులో ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం మొదటిసారి. అంతర్జాతీయ స్థాయిలో ఈ షో జరగబోతోంది. నేనూ, అన్నయ్య ఏసుదాస్‌, చిత్ర.. మా సినీ జీవితంలో లక్ష పాటలు పాడి ఉంటాం. అందులో ముప్ఫై పాటల్ని ఎంపిక చేసుకుని, వేదికపై ఆలపించడం చాలా కష్ట తరమైన విషయం. ఎలాంటి పాటలు ఎంపిక చేసుకోవాలనే విషయంలో ఇప్పటికే కసరత్తులు చేశాం. సింగపూర్‌లో ‘లెజెండ్స్‌’ పేరుతో ఓ షో నిర్వహిస్తే, చాలా గొప్ప ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలనుకుంటున్నాం. రెహమాన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్కెస్ట్రా నుంచి ఓ బృందం ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతోంది. మా గాయకులు ముగ్గురి మధ్య చక్కటి అనుబంధం ఉంది. అదే లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కేవలం వాణిజ్యపరంగా మిగిలిపోతాయ’’న్నారు. ఎస్‌.పి.చరణ్‌ మాట్లాడుతూ ‘‘ముగ్గురు అపురూప గాయకులు ఒకే వేదికపై ఉండడం అరుదైన విషయం. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి తెరవెనుక నేను కృషి చేస్తున్నా’’ అన్నారు.


నేనో గడ్డిపరకను.. బాలు: ఇటీవల ఇళయరాజా - బాలు మధ్య పేటెంట్‌ హక్కుల వివాదం నడిచింది. అది ఇప్పుడు సద్దుమణిగింది. దాని గురించి బాలు స్పందిస్తూ ‘‘మా మధ్య దూరం ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఆయన పిలిచారు. వెళ్లాను. ఇదివరకటిలానే కలిసి పనిచేశాం. ఇంట్లోవాళ్ల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి. మళ్లీ కలిసిపోతుంటారు. ఇదీ అలాంటిదే. మా ఇద్దరికీ కలిసి పనిచేయాలన్న కోరిక ఉన్నప్పుడు మిగిలిన విషయాలు చిన్నవి అయిపోతాయి. ఇద్దరం కలిసి కొన్ని షోస్‌లోనూ పాల్గొన్నాం. ఫిబ్రవరి వరకూ నా డేట్స్‌ కావాలని అడిగారాయన. ఆయన సంగీత దర్శకత్వంలో ఈమధ్య రెండు పాటలు పాడాను. జీవితం అనేది ఓ పాటలా గడిచి పోవాలి. మహా వృక్షాలు పెను తుపానులకు కూకటివేళ్లతో సహా కూలిపోతాయి. గడ్డిపరక అలానే ఉంటుంది. నన్ను నేనో గడ్డి పరక అనుకుంటుంటా’’ అన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.