కామెడీ టైమింగ్‌ నచ్చి సినిమా తీశాం
‘ఎలాంటి సినిమాకైనా విమర్శలు సహజం. ఒకొక్కరు ఒక్కో కోణంలో చూస్తూ వాళ్ల అభిప్రాయాల్ని వెల్లడిస్తుంటారు. అంతిమంగా థియేటర్‌లో ప్రేక్షకుడు సినిమాని ఆస్వాదిస్తున్నాడా లేదా అనేదే కీలకం’’ అన్నారు నిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి. ఆయన యష్‌ రంగినేనితో కలిసి నిర్మించిన చిత్రం ‘ఏబీసీడీ’. అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటించారు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు మధుర శ్రీధర్‌రెడ్డి. ఆ విషయాలివీ...


‘‘మాస్‌ మసాలా, వాణిజ్య ప్రధానమైన చిత్రాలకంటే కూడా కాన్సెప్ట్‌ కథలు, స్వచ్ఛమైన కుటుంబ కథలే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం సమాజంపై ప్రభావ చూపిస్తున్న రాజకీయం, సోషల్‌ మీడియా నేపథ్యంతో ముడిపడిన కథ ఇది. అందుకే ‘ఏబీసీడీ’ని తెలుగులో రీమేక్‌ చేశాం. శని, ఆదివారాల కంటే కూడా సోమవారం థియేటర్ల దగ్గర స్పందన సినిమాకి కీలకం. ఆ పరీక్షని మేం పాసయ్యాం’’.

* ‘‘ఇప్పటిదాకా పది సినిమాలు తీశా. వాటిలో ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిదే. తొలిసారి మేం చేసిన రీమేక్‌ సినిమా కూడా ఇదే. రీమేక్‌ తీయడం కష్టంతో కూడుకున్న విషయం. పలువురు దర్శకులకి సినిమాని చూపించి, వాళ్ల సలహాలు తీసుకొన్నాం. ‘శ్రీరస్తు శుభమస్తు’లో అల్లు శిరీష్‌ కామెడీ టైమింగ్‌ నచ్చి, ఆయనతో ఈ సినిమా తీశాం. శిరీష్‌ - భరత్‌లతో పాటు, వెన్నెల కిషోర్‌ల కామెడీ బాగా నవ్విస్తోంది’’.


*
‘‘ఒక ఫిల్మ్‌మేకర్‌గా కరణ్‌జోహార్‌ నాకు స్ఫూర్తి. ‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌’ తర్వాత నన్ను బాగా ఆసక్తికి గురిచేసిన కథాంశం దొరకలేదు. దాంతో నిర్మాతగానే ప్రయాణం చేస్తున్నా. ఈ యేడాది మాత్రం ఒక చిన్న సినిమాని తీయాలనుకొంటున్నా. తదుపరి మా సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘దొరసాని’. 1980 నేపథ్యంలో సాగే ప్రేమకథ అది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ, రాజశేఖర్‌ తనయ శివాత్మిక జంటగా నటించారు. జులై 5న విడుదల చేయబోతున్నాం. వెబ్‌ సిరీస్‌ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. 2020 కల్లా డిజిటల్‌ మార్కెట్‌ రూ: 35 వేల కోట్లకి చేరబోతోంది. ఇక నుంచి ప్రతి నిర్మాణ సంస్థ బుల్లితెరని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేయాల్సిందే’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.