ఎస్వీఆర్‌ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా

‘‘అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన నటుడు ఎస్వీ రంగారావు. ఆయన స్ఫూర్తితోనే నేను చలనచిత్ర రంగంలోకి వచ్చాన’’న్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎస్వీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఏడో తరగతి చదివే సమయంలోనే నాకు నటనపై ఇష్టం ఏర్పడింది. అప్పట్లో ఎస్వీఆర్‌ నటించిన జగత్‌ కిలాడీలు, జగత్‌జెంత్రీలు సినిమాల్లో మా నాన్నగారికి చిన్న పాత్రలు లభించాయి. ఆ సినిమా షూటింగ్‌ సంగతుల గురించి, ఎస్వీఆర్‌ నటన గురించి మా నాన్నగారు మా అందరితో చెబుతుండేవారు. అలా సినిమాలపై మరింత ఆకర్షణ పెరిగింది. ఓవైపు చదువుకుంటున్నా, మనసు నిండా సినీరంగం గురించి ఆలోచనలు ఉండేవి. ఆ తరవాత సినిమాల్లోకి వెళ్లిపోయా. ఈరోజు ఇలా ఎస్వీఆర్‌ విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉంద’’న్నారు. నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘ఎస్వీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం తెలుగువారంతా కలసికట్టుగా పోరాడాలి’’ అన్నారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, గంటా శ్రీనివాసరావు, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు ఈలి నాని, బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.