ఆయన మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు

‘ఒక స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలని... అది నా కెరీర్‌కే ప్రత్యేకంగా ఉండాలని ఎదురు చూశా. అలాంటిది 12 యేళ్ల కిందట పరుచూరి సోదరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని వినిపించారు. ఆ కథతోనే తెరకెక్కింది... ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి ఇప్పటి వరకు చేసిన 150 సినిమాలు ఒకెత్తైతే, ‘సైరా...’ మరో ఎత్తు అని అందరూ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్‌ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘రెండున్నరేళ్లు కష్టపడి ఈ సినిమాని తీసుకొచ్చాం. ఈ కథని సురేందర్‌ రెడ్డి చేతిలో పెట్టాం. ఆయన మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ‘ఖైదీ నంబర్‌ 150’లో నన్ను అందంగా చూపించిన ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఈ సినిమాకి మరింత కష్టపడి పనిచేశాడు. రాజీవన్, కమల్‌ కన్నన్, బుర్రా సాయిమాధవ్‌ తదితర సాంకేతిక బృందం ప్రాణం పెట్టి పనిచేశారు. అమితాబ్‌ స్నేహానికి ఎంత విలువ ఇస్తారో అర్థమైంది. ఆయన రుణం తీర్చుకోలేనిది. అమితాబ్, అనుష్క ఏమీ ఆశించకుండా నటించి వెళ్లిపోయారు. ఈ సినిమాని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. ఉత్తరాది సినిమా, దక్షిణాది సినిమా అనే హద్దుల్ని చెరిపేసి భారతీయ సినిమాగా ప్రేక్షకుల మనసు దోచుకుంది’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ ‘‘లక్ష్మిగా నా కెరీర్‌లో అత్యుత్తమ పాత్రని చేసిన అనుభూతి కలిగింది. సురేందర్‌ రెడ్డి తీసే సినిమాల్లో చిన్న పాత్రయినా సరే ఒప్పుకుంటా’’ అన్నారు. సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపాను. చిరంజీవి సినిమా అంటే వినోదం, పాటలు ఉంటాయి. కానీ ఇందులో అవేవీ లేవు. పైగా చిరంజీవి పాత్ర చనిపోతుంది. మరి అభిమానులకి నచ్చుతుందా అని చాలా ఆలోచించా. కానీ ఇందులో దేశభక్తి ఉందని దాన్ని మాత్రమే నమ్ముకొన్నా’’ అన్నారు. ‘‘చిరంజీవితో చరిత్రలో నిలిచియే ఓ చిత్రం చేయాలనే కోరిక ఉండేది. తొలిసారి ఆంగ్లేయుల్ని ఎదిరించిన తెలుగువాడి కథని చిరంజీవితో చేస్తే బాగుంటుందనే ‘సైరా నరసింహారెడ్డి’ని రాశాం’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ‘‘మా అన్నయ్య 2004లో ఈ కథ రాశారు. 16 యేళ్లకి ఆయన కల నెరవేరడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘‘ఉయ్యాలవాడ వారి ఆత్మ, ఆయన ఆశీస్సులే మా అందరినీ కలిపాయి. దేశానికే గర్వకారణంలాంటి సినిమాని చేశారు. ఇలాంటి స్పందన వస్తుందని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో జగపతిబాబు, రత్నవేలు, సాయిమాధవ్‌ బుర్రా, సుస్మిత, దిల్‌రాజు, విక్కీ, కమల్‌కన్నన్, సత్యానంద్, వింధ్య, భూపతిరాజా తదితరులు పాల్గొన్నారు. 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.