తమిళంలో ‘గోలీసోడా’ ఇది
‘‘నా దృష్టిలో స్టార్‌ అంటే కథే. అందుకే ఈసారి కుర్రకారులో స్ఫూర్తిని నింపే ఒక విభిన్నమైన కథతో ‘ఎవడు తక్కువ కాదు’ చేశాం’’ అన్నారు ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌. ఆయన తనయుడు విక్రమ్‌ సహిదేవ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. ప్రియాంక జైన్‌ నాయిక. రఘు జయ దర్శకుడు. చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్‌ ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు.


*
‘‘సినిమా వినోదం మాత్రమే కాదు, స్ఫూర్తి కూడా. కుర్రకారుకి మంచి చెప్పే కథలు చెప్పాల్సిన అవసరం ఉంది. తమిళంలో విజయవంతమైన ‘గోలీసోడా’ అలాంటిదే. అందుకే దాన్ని రీమేక్‌ చేశాం’’.

*
‘‘తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య చర్చని లేవనెత్తే చిత్రమిది. ‘రేసు గుర్రం’ నుంచి ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వరకు పలు చిత్రాల్లో నటించిన మా అబ్బాయి విక్రమ్‌ సహిదేవ్‌... ‘మౌనరాగం’ ధారావాహికతో ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్‌ జోడీ బాగుంటుంది. ప్రతినాయకుడు మధు పాత్రని తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది. ఇందులో ప్రేమ, ప్రతీకారంతో పాటు కుర్రకారు కలలు ఉన్నాయి’’.

*
‘‘మా అబ్బాయి విక్రమ్‌ సహిదేవ్‌ మొదట నటనపైనే దృష్టిపెట్టాడు. సినిమాని తన భుజాలపై మోయగలడనే నమ్మకం ఏర్పడ్డాకే ఈ సినిమా చేశాం. సినిమాలో నటుడిగా తన ప్రతిభ చూశాక... తనతో మరో పూర్తిస్థాయి సినిమాని మొదలుపెట్టాలని నిర్ణయించాం. నిర్మాతగా నా ప్రయాణం ఎప్పుడూ విభిన్నమైన కథలతోనే’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.