రచయితలు లేకపోతే.. మేమెవ్వరం లేము - చిరు

‘‘చిత్ర పరిశ్రమలో దర్శక, నిర్మాతల తర్వాత నేను అత్యంత సన్నిహితంగా ఉండేది రచయితలతోనే. ఆ సరస్వతీ పుత్రులు లేకపోతే మేమెవ్వరం లేము. సినిమా అన్నదే లేదు’’ అన్నారు చిరంజీవి. తెలుగు సినీ రచయితల సంఘం మొదలై ఈ ఏడాదికి 25వసంతాలు పూర్తయిన నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్‌లో రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకులు చిరంజీవి, మోహన్‌బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందడరామి రెడ్డి, రావి కొండలరావులకు తన చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారాలు అందించారు చిరు. ప్రముఖ దర్శక, రచయితలు కె.విశ్వనాథ్, గొల్లపూడి మారుతి రావు, సింగీతం శ్రీనివాసరావు, భువన చంద్ర, ఆది విష్ణులకు సైతం ఈ పురస్కారాలు ప్రకటించారు. ఈ వేడుకలో చిరు మాట్లాడుతూ.. ‘‘ఇంతటి గొప్ప సభకు నన్ను పిలవకపోయి ఉంటే చాలా అసంతృప్తికి గురయ్యేవాడిని. విశ్వనాథ్‌గారికి నా చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం అందిద్దామని ఎదురుచూశా. అనుకోని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. తెలుగు చిత్రసీమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తిపు తెచ్చింది రచయితలే. ఆది విష్ణు, జంధ్యాల, రావికొండల రావు, పరుచూరి బ్రదర్స్‌ వంటి గొప్ప రచయితలతో నాకు అనుబంధం ఉంది. నా ‘మగమహారాజు’కు రచయితగా చేశారు ఆకెళ్ల. ఆది విష్ణు నాటక రచయితగా, నవలా రచయితగా ఎన్నో అద్భుతాలు చేశారు. రావి కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన బాపు రమణలకు ఆప్తుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నాటి నుంచి నేటికీ ఆయనలోని పసితనపు ఛాయలు ఇంకా అలానే ఉన్నాయి. కొదండ రామిరెడ్డిది నాదీ 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. రచయితలను బలంగా నమ్మే దర్శక,నిర్మాతల్లో ఆయనొకరు. భువన చంద్ర తొలిసారి నా ‘ఖైదీ 786’కి పాటలందించారు. ఆ సమయంలో ఆయన గురించి చెప్పినప్పుడు మిలటరీ మనిషి మనకి పాటలేం రాస్తాడు అనుకున్నా. కానీ, ఆయన రాసిన పాటలను నేటి తరమూ రీమేక్‌ చేసి పాడుకుంటున్నారు. ఆ సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు. వీళ్లంతా ఎంతో నేటితరానికి అరుదైన, భావితరాల వారికి అపురూపమైన వ్యక్తులుగా చిరస్థాయిగా నిలిచి ఉంటార’’న్నారు.


అనంతరం మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ఇంత గొప్ప సరస్వతి పుత్రులతో కలిసి ఇలా వజ్రోత్సవంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదు. ఇది నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. రచయితలు తమ అద్భుతమైన కథలు, సంభాషణలతో నిర్మాతలకు డబ్బులు, నటులకు జీవితాల్ని అందిస్తుంటారు. వాళ్ల ఆశీర్వాదాలు మాకెప్పుడూ ఉండాలి. రచయితలను గౌరవించుకోవడం కొద్దిమందికే తెలుస్తుంది. ఆత్రేయ చిత్రసీమకు ఎన్నో సిల్వర్, గొల్డెన్‌ జూబ్లీ చిత్రాలను అందించారు. కానీ, ఆయన చనిపోయిన నాడు ఏ నిర్మాతలు ఆయన్ని పట్టించుకోలేదు. పార్ధీవ దేహాన్ని చూడటానికి రాలేదు. మా కుటుంబం మాత్రమే ఆయన కడసారి దర్శనం చేసుకుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంతో మంది మేధావులు నా బ్యానర్‌లో పాటలు, కథలు, సంభాషణలు రాశారు. నా తొలి చిత్రానికి మాటలు రాసింది సత్యానంద్‌. తనని అరేయ్‌.. అని పిలుచుకోవడం దగ్గర్నుంచి మా అనుబంధం మొదలైంది. నాకు వేషం కావాలి అని అడుకున్న సత్యాకే నేనిప్పుడు అవార్డు అందివ్వడం సంతోషాన్నిస్తోంది. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి. పరుచూరి బద్రర్స్‌ నాకు మర్చిపోలేని గొప్ప సంభాషణలిచ్చారు’’ అన్నారు.


‘‘రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రచయితలే దర్శకులైపోతున్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ రచయితను నమ్ముకోవాల్సిందే. ఓ సినిమాకు దర్శకుడే కెప్టెన్‌ ఆఫ్‌ షిప్‌ అయితే.. దానికి కథ, సంభాషణలు ఇచ్చే రచయితను ఆ షిప్‌గా చెప్పవచ్చు. అందులో నటించే నటులంతా ప్రయాణికులు. ఆదరించే ప్రేక్షకులు సముద్రమ’’న్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ‘‘ఓ శిల్పి శిలను శిల్పంగా మలిచినట్లు.. కవి రాసే కథనే దర్శకులు సినిమాగా మలుస్తుంటారు. వీళ్లే చిత్రసీమకు మూలాధారం. రచయితలకు గౌరవం దక్కాలనే ఉద్దేశంతో యర్రం శెట్టి, ఎల్లూరి వెంకటేశ్వరరావు వంటి వారు ఈ సంఘానికి బీజం వేశారు. వాళ్లు ముళ్ల బాటలో నడిచి నేటి రచయితలకు పూల బాట పరిచారు. ఈ సంఘం 50 - 100ఏళ్ల వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణ. ఈ వేడుకలో త్రివిక్రమ్, బుర్రా సాయిమాధవ్, వక్కంతం వంశీ, తనికెళ్లభరణి, రామజోగయ్య శాస్త్రి, కోన వెంకట్, చిన్ని కృష్ణ, చంద్రబోస్‌ తదితరులకు విశిష్ఠ పురస్కారాలు ప్రకటించారు. ప్రముఖ రచయితలు విజయేంద్ర ప్రసాద్, డైమండ్‌ రత్నబాబు, రత్నం, సుద్దాల అశోక్‌ తేజ, వడ్డేపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

(మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.