కొన్నాళ్లు చిత్రీకరణలు ఆపడమే మంచిదితొందరపడి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కంటే, జూన్‌లో పరిస్థితుల్ని పరిశీలించి సినిమా చిత్రీకరణలపై ఓ నిర్ణయం తీసుకోవడమే మేలన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత సినీ పరిశ్రమ ప్రతినిధులతో మరోసారి సమావేశమవుతానని ఆయన తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలి కార్యాలయానికి వచ్చిన మంత్రికి చిత్రపరిశ్రమ సమస్యలపై పరిశ్రమ ప్రతినిధులు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘‘చిత్రీకరణలకి అనుమతి ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే కరోనా ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే కొన్నాళ్లపాటు చిత్రీకరణలు చేయకపోవడమే మంచిది. దశలవారీగా కొన్నింటికి అనుమతులు ఇస్తున్నాం. అందులో సినిమా చిత్రీకరణల్నీ భాగం చేసే విషయంపై చర్చిస్తాం. చిత్రీకరణలు, నిర్మాణానంతర పనులు చేసుకునే విషయంలో కేరళ, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాల్ని పరిశీలించి జూన్‌లో ఓ నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు తలసాని. చిత్ర పరిశ్రమకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మాట్లాడతామని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ కోసం త్వరలోనే ప్రభుత్వం ఒక ఉత్తమ పాలసీని తీసుకొస్తుందని స్పష్టం చేశారు. కరోనా క్రైసిస్‌ ఛారిటీ ద్వారా కార్మికులకి నిత్యావసరాలు అందించడం శుభపరిణామమన్న తలసాని, ప్రభుత్వం నుంచీ సినీ కార్మికులకి సాయం అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్‌దాస్‌ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు దిల్‌రాజు, ఎగ్జిబిటర్లు సునీల్‌ నారంగ్, విజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.