పనికి రాని గొంతే.. డిస్నీకి వెళ్లింది

జాన్‌ ఫెవరూ దర్శకత్వం వహించిన హాలీవుడ్‌ చిత్రం ‘ద లయన్‌కింగ్‌’. డిస్నీ వరల్డ్‌ స్టుడియోస్‌ సంస్థ నిర్మించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 19న విడుదల కానుంది. ‘లయన్‌కింగ్‌’లోని ముఫాసా, స్కార్‌, సింబా, నల, పుంబా, టిమోన్‌ పాత్రలకు తెలుగులో రవిశంకర్‌, జగపతిబాబు, నాని, లిప్సిక, బ్రహ్మానందం, అలీ డబ్బింగ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘ముఫాసా అనే సింహానికి డబ్బింగ్‌ చెప్పాను. మానవ జీవితాల్లోని భావోద్వేగాలకు ఈ చిత్రం ప్రతిబింబంగా అనిపించింది. నా జీవితంలోని అనుభవాలు గుర్తుకొచ్చాయ’’న్నారు. జగపతిబాబు మాట్లాడుతూ ‘‘అన్ని వయసుల వారినీ మెప్పించే చిత్రమిది. నేను డబ్బింగ్‌ చెప్పేటప్పుడు సినిమాని చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యాను. యానిమేషన్‌ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జంతువుల్లోని భావాలు, భావనలకి అతికేలా డబ్బింగ్‌ చెప్పాలి. ఇదివరకు నా వాయిస్‌ ఎందుకూ పనికిరాదని అన్నవాళ్లుఉన్నారు. ఇప్పుడు నా గొంతు డిస్నీ వరకూ వెళ్లినందుకు గర్వంగా ఉంద’’న్నారు. నాని మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ నా కోసం నేను సినిమాలు చేశాను. ఇది మాత్రం మా అబ్బాయి కోసం చేశాను. జంతువుల హావభావాలకి అతికేలా డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నవ్వేసేవాణ్ని. బ్రహ్మానందం, అలీ డబ్బింగ్‌ చెప్పిన పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇది హాలీవుడ్‌ చిత్రమే అయినా, మన భారతీయుల జీవితాల్లో తొణికిసలాడే భావోద్వేగభరితమైన కథ. అందుకే అందరికీ బాగా నచ్చేస్తుంద’’అన్నారు. ‘‘డిస్నీ తెరకెక్కించిన చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం నాకు దక్కిన గొప్ప గౌరవం. గొంతు విషయంలో అమితాబ్‌ బచ్చన్‌కు వచ్చినట్లే జగపతిబాబుకూ విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అదే అమితాబ్‌ని ప్రపంచమంతా గొప్ప నటుడన్నారు. జగపతిబాబుని కూడా అన్ని భాషా చిత్రాలూ కోరుకుంటున్నాయి’’ అన్నారు అలీ. కార్యక్రమంలో బిక్రమ్‌ దుగ్గల్‌ పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.