కొత్తవాళ్లు చిత్రసీమ రూపాన్ని మార్చేస్తున్నారు

‘‘కొత్తవాళ్ల రాకతో, వారి సరికొత్త ఆలోచనలతో తెలుగు చిత్ర పరిశ్రమ రూపమే పూర్తిగా మారిపోతుంది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. ఆయన ‘దొరసాని’ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనంద్‌ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్‌ నాయకానాయికలుగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో కేవీఆర్‌ మహేంద్ర అనే నూతన దర్శకుడు వెండితెరకు పరిచయమవుతున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ట్రైలర్‌ విడుదల అనంతరం సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘కథలో.. సినిమాలో.. నటుల మాటల్లో.. ఇలా ప్రతిదాంట్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త దర్శకులు, నూతన నటీనటుల రాకతో చిత్రసీమ రూపం మారిపోతుంది. ట్రైలర్‌లో ‘దొరసానీ ఈ నీళ్లు మేం తాగొచ్చా’ అని కథానాయకుడు అడిగినప్పుడు ఆమె అతనికి ముద్దు పెట్టిన సన్నివేశం ఒక్కటి చాలు దర్శకుడి ప్రతిభ గురించి చెప్పడానికి. ఈ సినిమా కన్నా ముందు మహేంద్ర ‘నిశీధి’ అనే లఘు చిత్రం చేశారు. అది దాదాపు 30 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. నా ఆరాధ్య గురువు, ప్రఖ్యాత దర్శకుడు శ్యాం బెనగల్‌ ఆ చిత్రం చూసి మహేంద్రను అభినందిస్తూ ప్రత్యేకంగా మెయిల్‌ పంపారట. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. నూతన నటీనటులతో అతి తక్కువ బడ్జెట్‌లో ఇంత చక్కటి అవుటుపుట్‌ను చూపగలగడం నిజంగా చాలా హైలైట్‌. ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం, సన్నీ ఛాయాగ్రహణం, గోరేటి వెంకన్న రాసిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దొరసాని పాత్రకు శివాత్మిక చక్కగా కుదిరింది. అచ్చ తెలంగాణ ఆడపడుచులా ఉంది. ఇద్దరు గొప్ప నటుల కలయిక ఆమె. ఒక వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చడం సరికాదు కానీ.. తన సోదరుడు విజయ్‌ దేవరకొండ మాటల్లో ఉన్నంత నిజాయితీ ఆనంద్‌లో కనిపిస్తోంది’’ అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘మా చిత్రం ఎంత నిజాయితీగా ఉందనేది ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. అంతా కొత్తవాళ్లతోనే చేశాం. ఈ చిత్రంతో ఇద్దరు మంచి నటులను చిత్రసీమకు పరిచయం చేస్తున్నా’’మన్నారు. ‘‘1980ల కాలంలో తెలంగాణలోని అప్పటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల మధ్య ఇద్దరు యువతీ యువకులు ప్రేమలో పడితే ఏం జరిగింది అనేది ఈ సినిమాతో చూపించబోతున్నాం. దాదాపు ఐదేళ్లుగా ఈ కథపైనే పనిచేస్తున్నాను. ఈ కథ నన్ను ఏరోజూ నిద్రపోనివ్వలేదు. ఈ చిత్రం తెరకెక్కించే క్రమంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆనంద్, శివాత్మికలిద్దరూ దొరసాని - రాజు పాత్రల కోసమే పుట్టారు. ఏడాదిగా ఆ పాత్రలతో ప్రయాణం చేసిన వారు ఇప్పటికీ వాటి నుంచి బయటకు రాలేదు. ఈ చిత్రంలో ప్రతిదీ ఎంతో వాస్తవికంగా, నిజాయితీతో నిండి ఉంటుంది. కొత్త దర్శకుడినైనా నాపై నమ్మకంతో నిర్మాతలు మంచి ప్రోత్సాహాన్నిచ్చారు’’ అన్నారు చిత్ర దర్శకుడు మహేంద్ర.


ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నాలుగేళ్ల క్రితం నేను యూఎస్‌లో పనిచేస్తున్నప్పుడు ఓసారి ‘పెళ్లిచూపులు’ చిత్ర వేదికపై అన్నయ్య మాట్లాడటం చూసి ఎంతో గర్వంగా ఫీలయ్యా. ఎన్నో ఏళ్లు కష్టపడి తాను అనుకొన్నది సాధించాడు. ఆ సమయంలో మా కుటుంబంలో ప్రతిఒక్కరూ ఎంతో ఆనందించారు. ఇప్పుడిక్కడ నన్ను చూసి మరోసారి మావాళ్లంతా అంతే ఆనంద పడుతుంటారు. నేను దేవరకొండ తమ్ముడిననో, శివాత్మిక జీవిత - రాజశేఖర్‌ల కూతురనో ఈ సినిమాలో మమ్మల్ని భాగం చేయలేదు. మేమంతా ఇప్పుడిలా ఒక దగ్గరకు చేరామంటే అదంతా దర్శకుడు నమ్మిన కథ వల్లనే. మా ప్రయత్నాన్ని తప్పక ఆశీర్వదిస్తాని ఆశిస్తున్నా’’మన్నారు. శివాత్మిక మట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో భాగమవడం చాలా గర్వకారణంగా ఉంది. తొలి సినిమాతోనే నాకింత మంచి పాత్రను ఇచ్చినందుకు చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో మమ్మల్ని ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఓ తల్లిగా ఇప్పుడు కోరకునేది ఒకటే. కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమాను హిట్‌ చేయాలని కోరకుంటున్నా’’ అన్నారు జీవిత రాజశేఖర్‌. ఈ కార్యక్రమంలో చిత్ర ఛాయాగ్రాహకుడు సన్నీ కొర్రపాటి, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌.విహారి, వెంకట సిద్ధారెడ్డి, పి.సి.దొరస్వామి, ధీరజ్‌ మొగిలినేని తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వీడియోలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.