ఇలాంటి టైటిల్‌ పెట్టడానికి ధైర్యం కావాలి

వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘వాల్మీకి’. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. పూజా హెగ్డే, అధర్వ కీలక పాత్రధారులు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈనెల 20న విడుదల కానుంది. ఆదివారం రాత్రి  హైదరాబాద్‌లో   విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన  వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘వరుణ్‌ ఈ సినిమాతో లుక్‌ మొత్తం  మార్చేశాడు. గద్దల కొండ గణేష్‌గా రచ్చ రచ్చ చేశాడు. ‘వాల్మీకి’ రామాయణం రాశాడు. ఈ వాల్మీకి ఏం రాశాడో సినిమా చూసి  తెలుసుకోవాల్సిందే. నా స్నేహితుడు పవన్‌ కల్యాణ్‌కి హరీష్‌ శంకర్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ ఇచ్చాడు. వరుణ్‌కి కూడా సూపర్‌ హిట్‌ ఇస్తాడన్న నమ్మకం ఉంద’’న్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ ప్రయోగాలు, క్లాస్‌ సినిమాలు, ప్రేమ కథలు చేశాను. కానీ మాస్‌ సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా. ‘మేం మాస్‌ ఎందుకు చేస్తానో నీకు అర్థం కావడం లేదు’ అని చిరంజీవిగారు చెప్పేవారు. ఈ సినిమాతో ఆ రుచేంటో తెలిసింది. ‘గబ్బర్‌ సింగ్‌’ చూసినప్పుడు ‘ఇది కదా సినిమా అంటే’ అనిపించింది. మా బాబాయ్‌కి అంత పెద్ద విజయాన్ని అందించిన హరీష్‌.. నాతో సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు. గీత రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘‘చిరంజీవి   కుటుంబంలోని కథానాయకులందరికీ పాటలు రాశాను. ఒక్క వరుణ్‌ తేజ్‌కి తప్ప. ఆ లోటు ఈ సినిమాలోని ‘ఒక్క ఒక్క’ పాటతో తీరింది’’ అన్నారు. ‘‘గగన వీధిలో అనే పాట రాశా. అలాంటి సాహిత్యం రాయించే దమ్ము, ధైర్యం ఈనాటి రోజుల్లో హరీష్‌ శంకర్‌కి మాత్రమే ఉంద’’న్నారు వనమాలి. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘‘ఇలాంటి టైటిల్‌ పెట్టడానికి కొంచెం గుండె ధైర్యం కావాలి. సాహిత్యంపై పట్టుండాలి. అవి రెండూ హరీష్‌ శంకర్‌కి ఉన్నాయి. వరుణ్‌ ఈ సినిమాతో అసాధారణమైన నటుడు అనిపించుకుంటాడ’’న్నారు. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌ మాట్లాడుతూ ‘‘గీత  రచయితలు మంచి పాటలు అందించారు. గాయనీ గాయకులు ఆ పాటలకు ప్రాణం పోశార’’న్నారు. ‘‘కవులకు కావల్సినంత టైమ్‌ ఇచ్చి పాట రాయించుకుంటారు హరీష్‌. గీత రచయితలకు ఆయన ఇచ్చే గౌరవం అదేన’’న్నారు భాస్కరభట్ల.


పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘వెల్లువచ్చే గోదారమ్మ లాంటి గొప్ప పాటని నన్ను నమ్మి నాతో చేయించారు. హరీష్‌ మంచి నటుడు. ఆయన నటించి చూపిస్తారు. వరుణ్‌తో ఇది నా రెండో సినిమా. ‘ముకుంద’లో నాకు డైలాగులు లేవు. ఈ సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయ’’న్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘వరుణ్‌తో మంచి వాణిజ్య విలువలు ఉన్న ‘వాల్మీకి’ చేయడం ఆనందంగా ఉంది. ‘గబ్బర్‌సింగ్‌’తో ఎలా అలరించారో.. ‘వాల్మీకి’తో అంతకంటే ఎక్కువ అలరిస్తారు హరీష్‌’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మన కవులకు, రచయితలకు మనం ఇవ్వాల్సిన గౌరవం, స్థానం ఇవ్వడం లేదేమో అనిపిస్తుంది. కొన్ని పాటల వేడుకల్లో వాళ్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. మనకు నచ్చిన పాటల్ని మరొకరితో పంచుకోవడం వల్ల సాహిత్యాన్ని బతికించుకున్నవాళ్లం అవుతాం. ఈ చిత్రానికి కెమెరా, సంగీతం రెండు మూల స్థంభాలుగా మారాయి. ‘డీజే’లో పూజా గ్లామర్‌ నచ్చితే  ఈసినిమాతో తన నటన నచ్చుతుంది. సెట్లో నేను కోప్పడితే, నన్ను కూల్‌ చేసేవాడు వరుణ్‌. 85 రోజులు నవ్వుతూ పనిచేసిన నా తొలి హీరో వరుణ్‌. సెట్లోకి రాగానే సెల్‌ఫోన్‌ని పక్కన పెట్టి తన పని తాను చూసుకుంటాడు. నేను రాసిన పాత్రని వంద రెట్లు గొప్పగా తెరపైకి తీసుకొచ్చాడు. వరుణ్‌తో జీవితాంతం సినిమాలు చేయాలన్న కోరిక కలిగించాడు. ఈమధ్యే పవన్‌ కల్యాణ్‌ గారిని కలిశాను. ఆయనకు ఈ ట్రైలర్‌ నచ్చింది. ఆయన దగ్గరకు వెళ్తే ఓ అన్నయ్య దగ్గరకో, స్నేహితుడి దగ్గరకో వెళ్లినట్టు అనిపిస్తుంద’’న్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఎఫ్‌ 2’ లానే ఈ సినిమాకి తిరుగు ఉండది. మాస్‌ పాటలతో మిక్కీ తన ట్రెండ్‌ మార్చేశాడ’’న్నారు. ఈ కార్యక్రమంలో మృణాళిని, అధర్వ, డింపుల్‌, అవినాష్‌, హరీష్‌ కట్టా, అనిల్‌ సుంకర, రామ్‌, శశి, పంకజ్‌, అనంత్‌, వంశీ, శత్రు తదితరులు పాల్గొన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.