‘నిన్ను తలచి’.. ఓ అందమైన ప్రేమకథ

వంశీ ఏకసిరి, స్టెఫీ పాటెల్‌ నాయకానాయికలుగా నటిస్తోన్న చిత్రం ‘నిన్ను తలచి’. అనిల్‌ తోట దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్‌ రెడ్డి, ఓబులేశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏలేందర్‌ మహవీర స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని రెండు వీడియో గీతాలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు మంచి ఆదరణ దక్కింది. తాజాగా విడుదల చేస్తున్న పాటలకు శ్రీమణి, పూర్ణచారి సాహిత్యాన్ని అందించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంలో బన్నీ వాసు ద్వారా సెప్టెంబరులో సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘ఓ అందమైన ప్రేమ కథతో సినిమాను నిర్మిస్తున్నాం. అందరం ఓ ఫ్యామిలీలా కలిసి చిత్రాన్ని పూర్తి చేశామ’’న్నారు నిర్మాత అజిత్‌ రెడ్డి. స్వరకర్త మాట్లాడుతూ ‘‘సినిమాలోని ప్రతిపాట కథలో భాగంగానే వస్తుంటుంది. కేవలం పాటల కోసమే దాదాపు నెల రోజులు కష్టపడ్డాం. టైటిల్‌ గీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలస్తుంద’’న్నారు. ‘‘అభి, అంకితాల ప్రేమ ప్రయాణమిది. దర్శకుడు చిత్రాన్ని ఎంత చక్కగా తెరకెక్కించారన్నది తెరపై చూస్తుంటే మీకే తెలుస్తుంద’’న్నారు హీరో. ఈ కార్యక్రమంలో ధీరూ మహేష్, కేదారి శంకర్, కృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.