నాన్న కోరిక ఇది: వెంకటేష్‌

‘‘ఎన్నో సినిమాలు చేశా. ‘వెంకీమామ’తో నా కల నిజమైంది. ఎప్పుడూ రానా, చైతన్యలతో కలిసి పనిచేయాలనుకుంటా. మా అందరితో సినిమా తీయాలనేది నాన్న కోరిక. ఆయన ఇప్పుడు ఉండుంటే చాలా ఆనందించేవారు. నాన్నా... ఈ సినిమా మీకోసమే’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌. ఆయన తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకుడు. డి.సురేష్‌బాబు, టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాతలు. ఈ నెల 13న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం  హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. వెంకటేష్‌ మాట్లాడుతూ  ‘‘మామాఅల్లుళ్ల కథను బాబీ చెప్పడమే గొప్ప విషయం. మంచి భావోద్వేగాలతో, ప్రతి ఘట్టాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు. నాగచైతన్య ఇందులో  ఆల్‌రౌండర్‌గా మంచి అభినయం ప్రదర్శించారు. అన్ని వాణిజ్యాంశాలున్న ఈ చిత్రం అందరికీ వినోదం పంచుతుంది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నా సినీ ప్రయాణంలో ‘మనం’, ‘వెంకీమామ’ గొప్ప జ్ఞాపకాలు. ‘వెంకీమామ’కి ప్రతి విషయంలోనూ మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో పనిచేయాలనేది ఎప్పట్నుంచో ఉన్న కోరిక. ‘ప్రేమమ్‌’లో వెంకటేష్‌తో ఉన్నది ఒక్క సన్నివేశమైనా చాలా ఆత్రుతకి గురవుతూ నటించా. ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ఆసక్తిగా పనిచేశా. బాబీ మిలటరీ ఎపిసోడ్‌లో కొత్తగా చూపించాడు. రాశితో కలిసి మరిన్ని సినిమాలు చేస్తా’’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌కి పెద్ద అభిమానిని నేను. ఆయన కామెడీ చాలా ఇష్టం. మంచి నటుడే కాదు, మంచి వ్యక్తి కూడా. ‘మనం’లో చైతన్యతో ఒక సన్నివేశంలో నటించా. ఆ తర్వాత మళ్లీ ఇందులో నటించడం ఆనందంగా ఉంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.