దీనికంటే ఓ మామకి ఇంకేం కావాలి

వెంకటేష్, నాగచైతన్య కథా నాయకులుగా నటించిన చిత్రం ‘వెంకీ మామ’. బాబి దర్శకుడు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. డి.సురేష్‌బాబు, విశ్వప్రసాద్‌ నిర్మాతలు. తమన్‌ సంగీతం అందించారు. ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఖమ్మంలో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేను చైతూకి మాత్రమే వెంకీ మామను. ఈ సినిమా తరవాత తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే. ఎక్కడికి వెళ్లినా ‘వెంకీ మామ’ అనే పిలుస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో చైతూ తొలిసారి నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ నటన చించేశాడు. ఓ మామగా చాలా గర్వంగా ఉన్నా. దీనికంటే ఓ మామకి ఇంకేం కావాలి? మంచి కథ తెచ్చుకున్నాం. అందరం బాగా కష్టపడి పనిచేశాం. తమన్‌తో పాటు సాంకేతిక నిపుణులంతా కష్టపడ్డారు. బాబి ఎమోషన్‌ని చాలా బాగా తీశాడ’’న్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు మనం, వెంకీ మామ. ఇవి నాకు సినిమాలు కాదు. జ్ఞాపకాలు. కెమెరా వెనుక ఓ మామ.. కెమెరా ముందు ఓ మామ.. నన్నెంతో బాగా చూసుకున్నారు. ఈ సినిమా ద్వారా నేనేం సాధించినా ఆ క్రెడిట్‌ వారిద్దరికే. కంటెంట్, కమర్షియల్‌ అంశాలు రెండూ కలిపి బాబి ఈ సినిమా తీశాడు. ఈ సినిమాతో ఓ కొత్త దారి చూపించాడ’’న్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘అన్నిరకాల భావోద్వేగాలు ఉన్న మంచి సినిమా. వెంకీ, చైతూ అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. వినోదం, యాక్షన్‌తో పాటు అన్నీ ఉంటాయి. మామ అల్లరి ఈ సినిమాలో మామూలుగా ఉండదు. నూటికి నూరు శాతం వినోదం గ్యారెంటీ’’అన్నారు. విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మైలురాయిలాంటి సినిమా ఇది. ఈ కాంబినేషన్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంద’’న్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. నా కెరీర్‌ ప్రారంభంలోనే వెంకీ సర్‌తో నటించడం ఓ కలలా ఉంది. హిందీ టీచర్‌గా నటించాను. రాశీఖన్నా రూపంలో నాకు ఓ స్నేహితురాలు దొరికింద’’న్నారు. రాశీఖన్నా మాట్లాడుతూ ‘‘నా మనసుకి దగ్గరైన కథ ఇది. చైతో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వెంకీతో కలసి నటించేటప్పుడు సినిమాలు, జీవితం గురించీ చాలా నేర్చుకున్నా’’ అన్నారు. బాబి మాట్లాడుతూ ‘‘వెంకీతో కలసి పనిచేయడం వల్ల జీవితంపై నా దృక్పథం మారింది. ‘ఎఫ్‌ 2’లో వెంకటేష్‌లోని ఫన్‌ చూశారు. దాంతో పాటు మాస్‌ కోణం కూడా ఈ సినిమాలో చూపించాం. ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చినా కూడా నాగ చైతన్య చాలా కష్టపడి పనిచేస్తాడు. ఓ సొంత తమ్ముడిలా అనిపిస్తాడు. వెన్నెల పాత్రని పాయల్‌ చాలా బాగా చేసింది. సెట్లో అందరినీ నవ్వించింది రాశీ’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్‌ కూచిభొట్ల, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.