దేవరకొండకు నిద్ర పట్టట్లేదట


వి
జయ్‌దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీస్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మెహన్‌ చెరుకూరి, యష్‌.రంగినేని నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ ‘‘నా సినిమా విడుదల అవుతోందంటే చాలా ప్రశాంతంగా ఉండేవాడ్ని. విడుదలరోజు మధ్యాహ్నం లేచి ‘సినిమా ఫలితం ఏమిటి?’ అని ఆరా తీస్తుండేవాడ్ని. ఈసారి అలా కాదు. గత కొన్ని రోజులుగా సరిగా నిద్ర పట్టడం లేదు. అంత ఒత్తిడిలో ఉన్నా. ఈ సినిమా కోసం యేడాది పాటు కష్టపడ్డాం. ఇప్పటి వరకూ ఈ సినిమా మా చేతుల్లో ఉంది. ఇప్పుడు ప్రేక్షకుల చేతుల్లో పెట్టేస్తున్నాం. జస్టిన్‌ ప్రభాకర్‌ చాలా మంచి పాటలు ఇచ్చారు. నా కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ఆల్బమ్‌. ఇంత మంచి పాటల్ని ప్రేక్షకులతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. అందుకే బెంగళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్‌లలో మ్యూజికల్‌ ఫెస్టివల్‌ నిర్వహించబోతున్నాం. ఈ వేడుకలో నాతో పాటు మా టీమ్‌ అంతా ఆడి పాడుతుంద’’న్నారు. రష్మిక మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో లిల్లీ అనే పాత్రలో నటించాను. ఇరవై రోజుల పాటు సెట్లో నన్ను ఏడిపించారు. డబ్బింగ్‌ చెప్పడానికి కూడా చాలా సమయం తీసుకోవాల్సివచ్చింది. కేవలం అయిదు నిమిషాల సన్నివేశం కోసం నాలుగు నెలల పాటు క్రికెట్‌ కోచింగ్‌ తీసుకున్నాన’’న్నారు. ‘‘డియర్‌ కామ్రేడ్‌ అనేది ఓ సుదీర్ఘమైన ప్రయాణం. మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ఇక నేను కాదు.. సినిమానే మాట్లాడాల’’న్నారు దర్శకుడు. యశ్‌ రంగినేని మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో ఓ కొత్త విజయ్‌ని చూస్తార’’న్నారు. నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ ‘‘తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి ఈనెల 26న విడుదల చేస్తున్నాం. ఈనెల 22న విశాఖపట్నంలో విడుదల ముందస్తు వేడుక నిర్వహిస్తామ’’న్నారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.