వేడుకగా విజయనిర్మల కాంస్య విగ్రహావిష్కరణ

‘‘విజయనిర్మల లాంటి గొప్ప దర్శకురాలు, నటి నాకు భార్య కావడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. కానీ, ఇప్పుడామె నా మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం’’ అన్నారు సీనియర్‌ కథానాయకుడు కృష్ణ. ఆయన సతీమణి విజయనిర్మల తొలి జయంతి వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కృష్ణ తన చేతుల మీదుగా విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆమె గిన్నిస్‌ రికార్డు ఫలకాన్ని మహేష్‌బాబు ఆవిష్కరించారు. అనంతరం ఆమె పేరు మీదుగా ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డికి ‘విజయనిర్మల స్త్రీశక్తి అవార్డు’ను అందించారు. ఈ వేడుకల్లో కృష్ణ మాట్లాడుతూ.. ‘‘విజయనిర్మల రెండు మూడు చిత్రాల్లో నటించాక దర్శకత్వం చెయ్యాలన్న కోరిక బయటపెట్టింది. నేనప్పుడు తనకి ఓ సలహా ఇచ్చా. ముందు ఓ వంద చిత్రాల్లో నటించు తర్వాత దర్శకత్వం చెయ్యొచ్చన్నా. నేను చెప్పినట్లుగానే వంద చిత్రాల తర్వాత కన్నడలో ‘కవిత’ అనే చిత్రం చేసింది అది పెద్ద హిట్‌ అయింది. తర్వాత తెలుగులో ‘మీనా’ తీస్తే.. అదీ మంచి విజయాన్ని అందుకొంది. తర్వాత ఆమెకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ ఊపులోనే 46 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ రికార్డు అందుకొంది. ఆమె తెరకెక్కించిన వాటిలో 95 శాతం చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇది చాలా గొప్ప విషయం’’ అన్నారు.


మహేష్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసినంత వరకు విజయనిర్మల గారు గొప్ప వ్యక్తి. నా ప్రతి చిత్రం విడుదలయ్యా ఉదయాన్నే షో చూసి నాకు ఫోన్‌ చేసి అభినందించే వారు. నాన్న తర్వాత అలా మాట్లాడే రెండో వ్యక్తి ఆమె మాత్రమే. ‘సరిలేరు నీకెవ్వరు’ చూశాక నాన్న ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. ఆ వెంటనే నేను ఆమె మాటల కోసమే ఎదురు చూశా. కొద్ది క్షణాలకు ఆమె లేరు కదా అని గుర్తొచ్చింది. నిజంగా ఆమెను మేం చాలా మిస్‌ అవుతున్నాం. ప్రతి ఏటా ఆమె పుట్టిన రోజును ఘనంగా నిర్వహించే వాళ్లం. ఈ ఏడాది విగ్రహావిష్కరణతో ఆమెకు మేమిస్తున్న చిన్న నివాళి ఇది’’ అన్నారు. ‘‘నాకు బాగా ఇష్టురాలు.. స్నేహితురాలు.. ఆప్యాయంగా అన్న అని పిలిచే వ్యక్తి విజయ నిర్మల. ఆమె పేరులోనే విజయముంది. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ రికార్డు అందుకున్న మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. రాబోయే తరంలో ప్రతిఒక్కరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోని చిత్ర సీమలో ఎదగాల’’న్నారు సీనియర్‌ కథానాయకుడు కృష్ణంరాజు. ‘‘ప్రతిభ.. ప్రగతిని గుర్తించాలి. పైకొచ్చే వారికి చేయూతనిచ్చి మరింత పైకి తీసుకురావాలి అని అమ్మ విజయనిర్మల ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే ఇకపై ఆమె ప్రతి జయంతికి ఆమె పేరు మీదుగా ప్రతిభావంతులకు ‘విజయనిర్మల స్త్రీ శక్తి అవార్డు’ను ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈసారి తొలి అవార్డును ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డికి ఇస్తున్నామ’’న్నారు నటుడు వి.కె.నరేష్‌. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంపి గల్లా జయదేవ్, ఆది శేషగిరిరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మురళీ మోహన్, సుధీర్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.