సినిమాల్లో నేను నటిస్తానా అనుకున్నా.. అలాంటిది!!

‘‘సినిమాల్లో నాకంటూ ఓ స్థానం ఉంటుందా అని అనుకునేవాడిని. అలాంటిది నేనిప్పుడు నటుడిగా నిరూపించుకోవడమే కాక, నిర్మాతగానూ మారి అందరి కలలను నిజం చేయగలగడం ఎంతో సంతోషాన్నిస్తోంద’’న్నారు విజయ్‌ దేవరకొండ. ఇప్పుడాయన తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఈ చిత్రంతో కథానాయకుడిగా మారారు. అభినవ్‌ గోమఠం, అవంతిక, పావని గంగిరెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకుడు. ఈ చిత్రం తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు.


సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుక నిర్వహించుకోవడానికి చాలా కారణాలున్నాయి. ఈ చిత్రంతో మా అందరి కలలు నిజమయ్యాయి. కొత్తవాళ్లతో చేసిన ఈ ప్రయత్నానికి ఇంత మంచి ఆదరణ దక్కడం ఎంతో సంతోషాన్నిస్తోంది. దర్శకుడు షమ్మీర్‌ - సహాయ దర్శకుడు అర్జున్‌ ఈ కథతో 4ఏళ్లు ప్రయాణం చేశారు. ఇప్పుడు వాళ్లే కాదు.. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ సొంత గుర్తింపును దక్కించుకున్నారు. థియేటర్లోకి వెళ్లినప్పుడు అందులోని ప్రేక్షకులంతా నవ్వులు చిందిస్తూ కనిపించడం చాలా సంతృప్తినిస్తుంది. నా ‘పెళ్లిచూపులు’ అప్పుడూ ప్రేక్షకుల్లో ఇలాంటి నవ్వులే చూడాలనుకున్నా. చూశా. ఇప్పుడు ఈ చిత్ర విషయంలోనూ ఇదే జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఈ ఒత్తిడి జీవితంలో వినోదం చాలా అవసరం. అందుకే థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి నవ్వుకుంటున్నప్పుడు.. ఈ నవ్వులు మీకిచ్చినందుకు ‘నువ్వు బాగుండాలి’ అని నన్ను ఆశీర్వదించండి. నిజానికి నేనీ కథ చేయాల్సి ఉన్నప్పటికి వివిధ కారణాల వల్ల అది కుదరలేదు. కథ, షమ్మీర్‌ - అర్జున్‌లపై ఉన్న నమ్మకంతోనే నిర్మాతగా మారా. ‘పెళ్లిచూపులు’ చిత్ర సెట్స్‌లో తరుణ్‌ మాకు సీన్‌ వివరిస్తున్నప్పుడు ఆయన కామెడీ టైమింగ్‌ గమనించేవాడిని. అది నచ్చే తనీ పాత్రను చేయగలడు అన్న నమ్మకంతో పట్టుబట్టి హీరోగా చేయడానికి ఒప్పించా. ఇప్పుడు సినిమాలో తన కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నా నిర్మాణంలో రానున్న రెండో చిత్రంతో మరో కొత్త దర్శకుడిని తెరకు పరిచయం చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం సృజన్‌ అనే కుర్రాడు చెప్పిన కథ వింటున్నా. చాలా బాగుంది’’ అన్నారు. ‘‘ఓ పనిని ఇష్టపడి, దానికోసం నిబద్ధతతో పని చేసినప్పుడు అందులోనే దైవం కనిపిస్తుంది. అది ఈ చిత్ర విషయంలో మాకు అనుభవమైంది. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ తమ ఉన్నత ఉద్యోగాలను వదిలేసి వచ్చి మరీ కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. ఇంతమంది కొత్తవాళ్లను విజయ్‌ తెరపైకి తీసుకొస్తున్నాడంటే అది తనకి దేవుడిచ్చిన వరం. థియేటర్లో ప్రేక్షకులు 2 గంటల పాటు పగలబడి నవ్వుతున్నారు. ఇలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతిఒక్కరూ థియేటర్లో చిత్రాన్ని చూసి ఎంజాయ్‌ చేయండ’’న్నారు తరుణ్‌ భాస్కర్‌. దర్శకుడు షమ్మీర్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసిన ప్రతిఒక్కరూ నవ్వు ముఖాలతో బయటకొస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. ముగింపులో మేమిచ్చిన సర్‌ప్రైజ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. కొత్త వాళ్లమైనా మాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. చెన్నై నుంచి వచ్చినా ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు ఇక్కడే గడపడం వల్ల ఇదే మా సొంతిల్లులా మారిపోయింది. తరుణ్‌ నటుడిగానే కాక రచనా పరంగానూ నాకెంతో సహాయ సహకారాలు అందించారు. మాకింత మంచి అవకాశమిచ్చినందుకు విజయ్‌కు ధన్యవాదాల’’న్నారు. ‘‘ఈ సినిమాకి అసలైన హీరో దర్శకుడు షమ్మీరే’’ అన్నారు అభినవ్‌. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత అనురాగ్, సంగీత దర్శకుడు శివకుమార్, జీవన్, అవంతిక, పావని గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
                                    


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.