ప్రతినాయకానాయికలు ప్రేమించుకుంటే...

‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ వంటి చిత్రాలతో చిత్రసీమలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వి.ఎన్‌.ఆదిత్య. ఇప్పుడాయన తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘వాళ్లిద్దరి మధ్య’. విరాజ్‌ అశ్విన్, నేహా కృష్ణ నాయకానాయికలుగా నటిస్తున్నారు. అర్జున్‌ దాస్యాన్‌ నిర్మాత. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఫీమేల్‌ విలన్‌ - లేడీ విలన్‌కు మధ్య ఓ ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది అనే ఓ సరికొత్త ఆలోచనలో నుంచి ఈ కథను సిద్ధం చేశాం. స్క్రిప్ట్‌కు తగ్గట్లుగానే కొత్త నటీనటులతో చాలా ఫ్రెష్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అనుకున్న బడ్జెట్‌లో కేవలం 40 రోజుల వ్యవధిలో ఆడుతూపాడుతూ చిత్రీకరణ పూర్తిచేశాం. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా లోమా అనే పాత్రను పరిచయం చేశాం. ఇంతకీ అది ఏంటి? నాయకానాయికలకు దానితో సంబంధం ఏంటి? అసలీ చిత్రాన్ని ఎందుకు చూడాలి? వంటి ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం చెప్తాం. నా గత చిత్రాల్ని ఆదరించినట్లుగానే ఈ ప్రయత్నాన్నీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. 90శాతం టాకీ పూర్తయింది. డిసెంబరు కల్లా పూర్తి సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామ’’న్నారు నిర్మాత. ఈ సందర్భంగా హీరో విరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘నా రెండో చిత్రాన్నే ఆదిత్య సర్‌ వంటి పెద్ద దర్శకులతో చేయడగలగడం నా అదృష్టం. మంచి ప్రేమకథతో రూపొందింది. ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నాం. యువతరానికి కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేను ఇక్కడే పుట్టా. అమెరికాలో పెరిగా. చిన్నప్పటి నుంచీ నటనపై ఆసక్తి ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి రావాలని కలలు కనేదాన్ని. ఆ కల ఇప్పటికి నెరవేరింది. ప్రతిఒక్కరి జీవితాలతో కనెక్ట్‌ అయ్యే ప్రేమకథ ఇది. మా ఇద్దరి పాత్రలు చాలా బలంగా ఉంటాయి. తొలి చిత్రంతోనే ఇంత వైవిధ్యభరిత పాత్రను చేసే అవకాశం దక్కించుకున్నా’’ అంది కథానాయిక.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.