అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’. ఎవరు, ఎక్కడ, ఎందుకు...అనేది ఉపశీర్షిక. కె.వి.గుహన్ దర్శకుడు. డా.రవి పి.రాజు దాట్ల నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో రానా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘గుహన్ విభిన్నమైన ఆలోచనలున్న ఛాయాగ్రాహకుడు. ఆయనతో కలిసి పనిచేశా. తను దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్ని చూస్తుంటే ఇదొక హై కాన్సెప్ట్ కథ అనిపిస్తోంది. గుహన్ ఇలాంటి మరెన్నో సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తొలి సినిమా ‘118’ తర్వాత, రెండో సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఓ కొత్త కాన్సెప్ట్ ఇది. రానా చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కావడం ఆనందంగా ఉంది.’’ అన్నారు. ‘‘తెలుగుతోపాటు తమిళంలోనూ తెరకెక్కించాం. ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తుందీ చిత్రం’’ అన్నారు నిర్మాత. కార్యక్రమంలో సహనిర్మాత విజయ్ ధరన్ దాట్ల, నాయకానాయికలు పాల్గొన్నారు.