మేజర్‌’ అప్‌డేట్‌ వచ్చేదే.. కానీ!!

‘ఎవరు’ వంటి హిట్‌ తర్వాత అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌బాబు నిర్మిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌ సంస్థ సమర్పిస్తోంది. 26 - 11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ అమర వీరుడి జయంతి ఈరోజే. ఈ నేపథ్యంలోనే ‘మేజర్‌’ చిత్రం బృందం సినీ ప్రియులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుందట. కానీ, కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు అడివి శేష్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘ఈరోజు మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌ జయంతి. ఇది మా చిత్ర బృందానికి, దేశానికి చాలా ముఖ్యమైన రోజు. ఆయన జీవితాన్ని, దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి నాలో ఓ స్ఫూర్తి రగులుతుంది. నిజానికి ఈరోజు ఈ చిత్రం నుంచి ఆయన గౌరవార్థం ఓ పెద్ద ప్రకటన చెయ్యాలనుకున్నాం. కానీ, కరోనా కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాం. మళ్లీ త్వరలోనే మా చిత్రం నుంచి అప్‌డేట్‌ను అందిస్తాం’’ అని చెప్పుకొచ్చారు శేష్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.